బోనాల ఉత్సవాలకు డాక్టర్ కోట నీలిమకు ఆహ్వానం
సికింద్రాబాద్, జూన్ 17 (విజయ క్రాంతి): సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాడ మాస బోనాల ఉత్సవాల ను ఆగస్టు 2వ తేదీన నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికా రులు తెలిపారు. బుధవారం ఆల య ఈవో మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పండితులు పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమను క్యాంపు కార్యాలయంలో వారిని కలిశారు. ఆషాఢమాస బోనాల ఉత్సవాల వివరాలను తెలియజేస్తూ డాక్టర్ కోట నీలిమకు ఆహ్వాన లేఖను అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు మాట్లాడుతూ... జులై 19 వ తేదీన ఘటాల ఊరేగింపు ప్రారంభం అవుతుందని,ఆగస్టు 2 వ తేదీన అమ్మవారికి బోనాల సమర్పణ, 3వ తేదీన రంగం భవిష్య వాణి ఉంటాయని ఈవో వివరించారు. మరోవైపు డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బోనాల పండగను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని చెప్పారు. ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాలు అంటేనే గోల్కొండ, సికింద్రాబాద్, ఓల్ సిటీ ప్రాంతాలలో ఎంతో సందడి నెలకొంటుందని అన్నారు.
అందులో భాగంగా ఈ సంవత్సరం నిర్వహించే మహంకాళి అమ్మవారి జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తారని అన్నారు. తెల్లవారుజామున 3 గంటల నుండే అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని అన్నారు.ఒక్క హైదరాబాద్ నగరం నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తారని తెలిపారు.
దీనిని దృష్టిలో ఉంచుకొని వివిధ శాఖల అధికారులతో సమన్వయంతో వ్యవహరించి ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులకు సూచించారు. బోనాల పండగ నిర్వహణకు తనతో పాటు ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






