ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం: 15 మంది శిశువులు మృతి
పాకిస్థాన్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
ఏసీ కంప్రెసర్ పేలి 15 మంది శిశువులు సజీవ దహనం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఒక ప్రధాన ఆసుపత్రి(Pakistan hospital) గైనకాలజీ వార్డులో బుధవారం సంభవించిన అగ్నిప్రమాదంలో కనీసం 15 మంది శిశువులు మరణించారు. రాజధానిలోని అతిపెద్ద, అత్యాధునిక సదుపాయాలు కలిగిన ప్రభుత్వ ఆసుపత్రి అయిన 'పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్' (PIMS)లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఆ అగ్నిప్రమాదంలో 15 మంది శిశువులు మరణించారని అధికారులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం 6:45 గంటలకు ఆసుపత్రిలోని నర్సరీలో ఎయిర్ కండీషనర్ కంప్రెసర్ పేలడంతో అగ్నిప్రమాదం సంభవించినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సహాయక చర్యల వీడియోలలో, అగ్నిమాపక సిబ్బంది కిటికీ అద్దాన్ని పగలగొట్టి ఆసుపత్రి మూడవ అంతస్తులో ఉన్న నర్సరీలోకి ప్రవేశించడం కనిపించింది. MCH విభాగంలో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది నవజాత శిశువులు పూర్తిగా కాలిపోయారని జిల్లా యంత్రాంగం అధికారులు మీడియాకు తెలిపారు. మంటలు ఆర్పేశామని, ఆ ప్రాంతంలో సహాయక బృందాలు శీతలీకరణ చర్యలు చేపడుతున్నాయని సహాయక చర్యల అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు అదనపు డిప్యూటీ కమిషనర్ అధ్యక్షతన ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.






