ఎస్ఐఆర్ నోటీసులు అందాయా... అయితే పత్రాలు సమర్పించండి
నిర్ణీత తేదీ, సమయంలో సంబంధిత వివరాలు అందజేయాలి
మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్
బాన్సువాడ,(విజయ క్రాంతి): ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా సంబంధిత ఓటర్లకు నోటీసుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. నోటీసులు అందుకున్న ఓటర్లు, అందులో పేర్కొన్న షెడ్యూల్ తేదీ, సమయానికి అవసరమైన వివరాలు, సంబంధిత పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలని బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ గోవు గంగాధర్ సూచించారు. నిర్ణీత తేదీన అవసరమైన వివరాలు లేదా పత్రాలు సమర్పించకపోతే ఓటర్ల వివరాల పరిశీలన ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.
నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు ప్రత్యేక శ్రద్ధ వహించి సంబంధిత బీఎల్ఒ లేదా వార్డు అధికారిని సంప్రదించాలని సూచించారు. నోటీసులో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం బాన్సువాడ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో అవసరమైన పత్రాలు, వివరాలను సమర్పించాలని కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో లభిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.






