14 August, 2026 | 9:48 PM

నీట్‌ను రద్దు చేయాలి

18-06-2024 03:45 AM
  • అవకతవకలపై సుప్రీం కోర్టు జడ్జితో విచారణ చేయించాలి
  • గోవుల అంశంపై స్పందించే బీజేపీ నేతలు నీట్‌పై స్పందించలేరా?
  • పలు విద్యార్థి, యువజన సంఘాల నేతల ఆగ్రహం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (విజయక్రాంతి): నీట్ అవకతవకలు చోటుచేసుకున్నాయని, కేంద్రం వెంటనే పరీక్షను రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.ఎల్ మూర్తి, టి.నాగరాజు, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.లక్ష్మణ్, కె.మణికంఠరెడ్డి, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, బీహార్, హర్యానాలో ఆ పార్టీకి చెందిన నేతలే నీట్ పేపర్‌ను లీక్ చేశారని ఆరోపించారు.

పేపర్ లీక్ జరిగి ఒక్క మార్కు తేడాతో లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. నీట్‌పై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గోవుల రక్షణ గురించి మాట్లాడే బీజేపీ నేతలు, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎందుకు మాట్లాడరని నిలదీశారు. నీట్ నిర్వహణ బాధ్యతలను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలన్నారు. గతంలో తెలంగాణలో గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే 10 లక్షల మంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వం తిరిగి పరీక్ష నిర్వహించిందని గుర్తుచేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్‌పై స్పందించకుండా, ప్రధానికి మోదీకి పీఆర్‌వోలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

నీట్ పేపర్ లీక్‌పై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ స్పందించకుంటే, త్వరలో వారి ఇళ్లను ముట్టడిస్తామన్నారు. నీట్ రద్దు చేయాలని మంగళవారం హిమాయత్ నగర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు పలు విద్యార్థి సంఘాలు ఐక్యంగా స్టూడెంట్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం స్టూడెంట్ మార్చ్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో వీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి మహేష్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దర్మేంద్ర, పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ ప్రదీప్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నాయకురాలు చందనరెడ్డి, ఇతర నాయకులు బాయికాడి శంకర్, గ్యార నరేష్, అశోక్‌రెడ్డి, లెనిన్ పాల్గొన్నారు.