06-02-2026 01:45:38 AM
అప్పుల బాధతో ఐదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న గిరిజన రైతు నాగవతరాజు
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి వ్యవసాయ కమిషన్ సభ్యులు భూమి సునీల్ బాసటగా నిలిచారు. తన తండ్రి జ్ఞాపకార్థం వారికి ఆర్థికసాయం అందజేశారు. భూమి సునీల్ తండ్రి మేక సంజీవరెడ్డి ద్వితీయ వర్ధంతిని రైతు కుటుంబాలను ఆదుకునే కార్యక్రమంగా మార్చారు. తండ్రి జ్ఞాపకార్థం ఏటా ఒక రైతు కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇందులో భాగంగా ములుగు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న గిరిజన కౌలు రైతు కుటుంబానికి వ్యవసాయ సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి చేతుల మీదుగా గురువారం రూ.25 వేల ఆర్థిక సాయంచేశారు. తార్నాకలోని లీఫ్స్ కార్యాలయంలో ఈ కార్యక్రమానికి హాజరైన కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, రాములునాయక్, గోపాల్‌రెడ్డి ఆ కుటుంబానికి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని దీనికి అదనంగా మరో రూ.15 వేల ఆర్థిక సాయం అందించారు.
కమిషన్ సభ్యురాలు భవానిరెడ్డి ఆ కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. పిల్లలను బాగా చదివించాలని, అందుకు తగిన సాయం అందిస్తామని పేర్కొన్నారు. ములుగు జిల్లా దేవగిరిపట్నానికి చెందిన గిరిజన రైతు నాగవతరాజు (40) ఎనిమిది ఎకరాల భూమిని కౌలు తీసుకుని పత్తి, వరి సాగుచేశారు. వరుసగా మూడేండ్లు పంట నష్టం రావటంతో రూ.5 లక్షల వరకు అప్పులు అయ్యాయి. అప్పుల ఒత్తిడిని తట్టుకోలేక 2020 జనవరి 23న పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్య లావణ్య కూలి పనులు, కుట్టు మిషన్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.