06-02-2026 01:45:47 AM
ప్రాజెక్టుల పనుల పురోగతిని పర్యవేక్షించేదెవరని ప్రశ్నలు
గత నెలలో అంజాద్ హుస్సేన్ ఉద్యోగ విరమణ
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి) : తెలంగాణ వ్యాప్తంగా సమృద్ధిగా సాగునీటిని అందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చడంలో భాగంగా కీలకమైన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కానీ ఇరిగేషన్ శాఖలో అత్యంత కీలకమైన సాంకేతిక పదవి అయిన ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) పోస్టు ఖాళీగా ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి కొద్ది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నిర్మాణం, పాలమూరు-రంగారెడ్డి, తుమ్మిడిహట్టి వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడంలో అధికారుల పర్యవేక్షణ కీలకపాత్ర పోషిస్తుంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమైన ప్రాజెక్టుల పనుల పురో గతిని సమన్వయం చేయాల్సిన అధికారి లేకపోవడంతో ఇరిగేషన్ శాఖలో అనిశ్చితి నెలకొంది. అయితే ఒకవైపు రాష్ట్ర ప్రభు త్వం సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే తమ ప్రాధాన్యం అని చెబుతున్న క్రమంలో ఇరిగేషన్ శాఖలో నిర్ణయాలు నిలిచిపోతున్నాయనే విమర్శలకు తావిస్తోంది.
ఈఎన్సీ నియామకంలో జాప్యం
ఇరిగేషన్ శాఖలో ఇంజినీర్- ఇన్ -చీఫ్(ఈఎన్సీ) నియామకంలో జాప్యం జరుగుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మా రింది. కీలక సాగునీటి ప్రాజెక్టులు నిర్ణయాత్మక దశలో ఉన్న సమయంలో, అత్యున్నత సాంకేతిక అధికారి లేకపోవడం ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు లేపుతోంది. మాజీ ఈఎన్సీ అం జాద్ హుస్సేన్ గత నెలలో ఉద్యోగ విరమణ చేయడంతో ఇరిగేషన్ శాఖలో అత్యంత కీలకమైన పదవి ఖాళీ అయింది.
సాధారణంగా ఇలాంటి పోస్టులకు ముందస్తు ప్రణాళికతో నియామకం జరుగుతుంటే, ఈసారి మాత్రం రోజులు గడుస్తున్నా నియామకంపై స్పష్టత లేకపోవడం శాఖలో గందర గోళానికి దారి తీసింది. ఇరిగేషన్ శాఖ ఇప్పటికే నిర్మాణ లో పాల ఆరోపణలు, కమిషన్ల విచారణలు, నిధుల కొరత, పనుల నాణ్యతపై విమర్శల వంటి సమస్యలతో సతమతమవుతోంది. ఈ పరిస్థితుల్లో నిర్ణయాధికారం కలిగిన అధికారి లేకపోవడం ఫైళ్ల కదలిక నెమ్మదిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం మాత్రం ఇరిగేషన్ ప్రాజెక్టులే అభివృద్ధికి పునాది అన్న భావనతో మేడిగడ్డ, ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు-రంగారెడ్డి, తుమ్మిడిహెట్టి వంటి ప్రాజెక్టులపై ప్రత్యేక దష్టి సారించింది. ఇవి కేవలం నిర్మాణ పనులే కాకుండా, టెక్నికల్ అప్రూవల్స్, డిజైన్ మార్పులు, భద్రతా అంచనాలు, పనుల పర్యవేక్షణ అన్నింటికీ ఈఎన్సీ కీలక పాత్ర పోషించాల్సిన ప్రాజెక్టులు కావడంతో విమర్శలు వస్తున్నాయి.
లక్ష్యం చేరుకోవడం ఎలా సాధ్యం?
ఇరిగేషన్ శాఖకు కీలక అధికారి అయిన ఈఎన్సీనే లేకపోవడంతో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం ఎలా సాధ్యమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా మేడిగడ్డ, ఎస్‌ఎల్‌బీసీ వంటి ప్రాజెక్టులు అత్యంత సున్నితమైనవిగా మారిన నేపథ్యంలో, అనుభవజ్ఞుడైన ఈఎన్సీ లేకపోవడం భవిష్యత్‌లో మరిన్ని సాంకేతిక, న్యాయపరమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
అయితే గతంలో ఎప్పుడైనా అధికారి ఉద్యోగ విరమణకు ముందే కొత్త ఈఎన్సీని ప్రభుత్వం ప్రకటిస్తుండేది. లేదంటే ఆ పోస్టులో ఇన్‌చార్జిని నియమిస్తుండేది. కానీ.. ఈసారి ఈఎన్సీ జనరల్ ఉద్యోగ విరమణ చేసి రోజులు కావస్తున్నా ఇంతవరకు కొత్త నియామకం చేపట్టలేదు. అటు ఇన్‌చార్జి బాధ్యతలు సైతం ఎవరికీ ఇవ్వలేదు. దాం తో ఈఎన్సీ నియామకంలో ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతున్నదనే అంశం ఇప్పుడు ఆ శాఖలో చర్చకు దారితీసింది.
ప్రాజెక్టులపై సున్నితమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో బాధ్యతను ఎవరూ తీసుకోవద్దన్న ఆలోచనతోనే ని యామకం వాయిదా పడుతుందన్న చర్చ జరుగుతున్నది. ఇరిగేషన్ వంటి అత్యంత కీలక శాఖను ఇన్‌చార్జ్ పాలనతో నడపడం సరికాదని, పూర్తిస్థాయి బాధ్యత కలిగిన ఈఎన్సీ నియామకమే ఏకైక పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు.
కీలక సమయంలో అధికారి లేకపోతే ఎలా?
ప్రస్తుతం ఇరిగేషన్ శాఖలో నెలకొన్న అత్యవసర పరిస్థితుల్లో ఈఎన్సీ లేకపోవడం వల్ల ఆయా ప్రాజెక్టుల పురోగతి పనులను ఎవరు పర్యవేక్షిస్తారు? ఎవరు తుది నిర్ణయం తీసుకుంటారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రత్యేకంగా మేడిగడ్డ, ఎస్‌ఎల్‌బీసీ వంటి ప్రాజెక్టులు ఇప్పటికే వివాదాలు, సాంకేతిక లోపాల ఆరోపణల మధ్య ఉండటంతో కీలకమైన అధికార యంత్రాంగం అత్యవసరంగా మారింది.
అయితే ఈఎన్సీ నియామకం ఆలస్యం కావడం వెనుక సీనియారిటీ వివాదాలా? శాఖలో అంతర్గత లాబీలా? లేక రాజకీయ స్థాయిలో తుది నిర్ణయం తీసుకోలేకపోవడమా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సీనియర్ ఇంజినీర్లు రేసులో ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఇంకా స్పష్టమైన సంకేతాలు ఇవ్వకపోవడం చర్చకు తావిస్తోంది. ఈఎన్సీ లేకపోవడం వల్ల బిల్లుల ఆమోదం, టెండర్ ప్రక్రియలు, ప్రాజెక్ట్ సమీక్షల వంటి అంశాల్లో జాప్యం జరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది చివరికి ప్రాజెక్టుల పూర్తి గడువులపై ప్రభావం చూపే అవకాశముంది.