మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం
తప్పిన ప్రాణనష్టం, ఆస్తినష్టం అంచనావేస్తున్న అధికారులు
భువనేశ్వర్, మే 23: ఒడిశా ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పవర్ స్టేషన్ షట్‌డౌన్ అయింది. విద్యుత్ కేంద్రంలో ఉన్న కేబుల్ ప్యానెల్స్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడం, దట్టమైన పొగలు అలుముకోవడంతో లోపల చిక్కుకుపోయిన కార్మికులను సురక్షితంగా బయటికి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది నానా తంటాలు పడ్డారు.
కొండల మధ్య జల విద్యుత్ కేంద్రం ఉండడంతో సహాయక చర్యల్లో ఆలస్యం ఏర్పడింది. ప్రమాదాన్ని ముందే గమనించిన కొంతమంది సిబ్బంది మిగతా కార్మికులను అప్రమత్తం చేసి టర్బైన్ ఫ్లోర్‌లో చిక్కుకున్నవారిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో విలువైన కేబుల్ ప్యానెల్స్, వైరింగ్, ఇతర పరికరాలు కాలి బూడిదయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.






