మెకానిక్ షెడ్డులో అగ్నిప్రమాదం
- బ్యాటరీ పేలుడుతో కార్లు, బైక్ దగ్ధం
- మంటలను అదుపు చేసిన డిఫెన్స్ ఫైర్ సిబ్బంది
- అన్నారం వార్డులో ఘటన
గుమ్మడిదల, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం వార్డు లో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు సోనీ మోటర్ మెకానిక్ షెడ్‌లో ఉన్న కారు బ్యాటరీ పేలడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. పేలుడు అనంతరం మంటలు వేగంగా వ్యాపించి షెడ్లో ఉన్న వాహనాలను ఆవరించాయి. ఈ ఘటనలో రెండు కార్లు, ఒక మోటార్ సైకిల్‌తో పాటు షెడ్‌లోని పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్‌కు చెందిన ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకుని సకాలంలో మంటలను అదుపులోకి తేవడంతో మరింత నష్టం తప్పింది. స్థానిక పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రహదారిపై ట్రాఫిక్‌ను నియంత్రించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.






