కాంగ్రెస్‌లోకి ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు!
బీఆర్‌ఎస్ నుంచి 20 మంది రెడీగా ఉన్నారు
ఆగస్టు సంక్షోభం ఒట్టి మాటే
బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చిప్ పాడైంది
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి ఆగస్టు సంక్షోభం తప్పదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్లేవారు ఎవరు లేరని, కానీ బీఆర్‌ఎస్ నుంచి 20 మంది, బీజేపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో మంగళవారం మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలు రావడంతో అప్పుడు తమ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్యతో మొత్తం 90 మంది కంటే ఎక్కువగానే ఉంటారని, అలాంటప్పుడు తమ ప్రభుత్వం ఆగస్టులో ఎందుకు కూలిపోతుందని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నా రని చెప్పారు. బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని బీజేపీ లక్ష్మణ్ అనడం అవివేకం. కేసీఆర్ తన పార్టీని ఎందుకు విలీనం చేస్తారు? ఆయన ఏమైనా జోతిష్యం చెబుతున్నారా? లక్ష్మణ్ రాజకీయ చిప్ పాడైంది. ఆగస్టు సంక్షోభం అనేది ఒట్టి మాట. మా ప్రభుత్వం పాలు ఇచ్చే ఆవులాంటిది. బట్టకాల్చి మీద వేయడం బీజే పీకి అలవాటు. చెప్పింది చేయడం గాంధీ కుటుంబానికి అలవాటు. మోసాలు చేయడంలో బీజేపీది అం తర్జాతీయస్థాయిలో మొదటి ర్యాంక్. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. బీజేపీ ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసింది. ఏమి అభివృద్ది చేశా రో చెప్పకుండా దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బీజేపీ బహిరంగ చర్చకు సిద్ధమా? అని జగ్గారెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగా యని, ఆ క్రెడిట్ కాంగ్రెస్‌కు, సీఎం రేవంత్‌రెడ్డికి దక్కుతుందన్నారు. ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల రైతు రుణమాఫీ, మహిళలకు రూ.2,500 ఇస్తామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బంగారం ధర కూడా తగ్గుతుందన్నారు. లక్ష్మణ్ తొందరపడి మాట్లాడవద్దన్నారు.




