20 వరకు జైల్లోనే కవిత
కస్టడీ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు
హైదరాబాద్ / న్యూఢిల్లీ, మే 14 (విజయక్రాంతి): ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. ఆరు రోజుల పాటు కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మే 20 వరకు కస్టడీని పొడిగించిన కోర్టు.. తదుపరి విచారణ అదే రోజున చేపడుతామని తెలిపింది. కాగా, 14 రోజుల పాటు కవితను జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, చార్జ్‌షీటు దాఖలు చేశామని కోర్టుకు ఈడీ తెలిపింది.
గతంలో సీబీఐ కేసులో కూడా మే 20 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. 8 వేల పేజీలతో కవితపై సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలు చేసినట్లు కోర్టుకు ఈడీ చెప్పింది. ఈ చార్జిషీటును పరిగణనలోకి తీసుకునే అంశాన్ని మే 20న విచారిస్తామని కోర్టు పేర్కొంది. మే 14తో గతంలో విధించిన కస్టడీ ముగియడంతో కవితను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరుపరిచారు. లిక్కర్ కేసులో అరెస్టయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.




