4 April, 2026 | 10:06 AM

రేవంత్‌కు ఆగస్టు సంక్షోభం

15-05-2024 01:21 AM

రుణమాఫీ చేయకపోతే ప్రజలే ఎదురుతిరుగుతారు

ఎన్డీయే 400 సీట్లు గెలుచుకుంటుంది

కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు

బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): దేవుళ్లపై ఒట్టు పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి పంద్రాగస్టులోపు రైతులకు రుణమాఫీ చేయకపోతే అగస్టు సంక్షోభం తప్పదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కే లక్ష్మణ్ హెచ్చరించారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ.. రేవంత్ ప్రజలకు ఇచ్చిన  హామీలు నెరవేర్చకపోతే ప్రజలతోపాటు కాంగ్రెస్ నేతలు సైతం తిరగబడతారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో  బీజేపీకి 370, మొత్తం ఎన్‌డీఏకు 400 సీట్లు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని, రేవంత్‌రెడ్డి హామీలను, ఒట్లను ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలుకు నోచుకోవాలంటే రూ.2 లక్షల కోట్లు కావాలన్నారు. రాష్ట్రాన్ని మరింత అప్పులకుప్పగా మార్చి సంక్షోభంలోకి కాంగ్రెస్ తీసుకెళ్తుందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే రేవంత్‌రెడ్డి నడుస్తున్నారంటూ విమర్శించారు. గత బీఆర్‌ఎస్ హయాంలో కాళేశ్వరం అవినీతిపరులపై చర్యలు తీసుకోలేదని, ధరణి సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల్లో ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదన్నారు. ఈ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ చచ్చిన పాములా మారిందన్న ఆయన..

గ్యారేజీ నుంచి కారు బయటకు వచ్చే పరిస్థితి లేదంటూ ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణ వచ్చినప్పుడే బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని కెసిఆర్ కటుంబంతో కలిసి సోనియాగాంధీ కాళ్ళముందు మోకరిల్లిన సంగతి తెలంగాణ సమాజానికి తెలుసునన్నారు. ప్రధాని మోదీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఏకమై కట్రలు చేశారని ఆయన ఆరోపించారు.

బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారాన్ని ఎవరూ నమ్మలేదన్నారు. కాంగ్రెస్ మాదిరిగా మోదీ ఓట్ల కోసం గ్యారెంటీలు, ఉచితాల పేరుతో ప్రలోభ పెట్టే వ్యక్తి కాదని ప్రజలు బలంగా నమ్మారన్నారు. రాష్ట్రంలో అప్పు తెస్తే కాని ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు. 5 నెలల పాలనలో విద్యుత్ కోతలు, నీటి కొరత, సాగునీటి రంగాలపై స్పష్టత లేకుండా నడుస్తోందన్నారు.