16 April, 2026 | 2:54 AM

డిటోనేటర్లు పేలి ఐదుగురు మృతి

16-04-2026 01:38 AM

12 మంది పరిస్థితి విషమం

ఏపీ సత్యసాయి జిల్లా కదిరి మండలంలో ఘటన

అమరావతి, ఏప్రిల్ 15: ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన డిటోనేటర్లు, గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి ఆ ఇంటితోపాటు చుట్టుపక్కన ఉన్న మరో నాలుగు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అగ్నిమాపకశాఖ అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఓ కూలీ ఇంట్లో నిల్వ ఉంచిన నాలుగు డిటోనేటర్లు పేలడంతో గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకున్నాయి.

ప్రాథమిక దర్యాప్తులో డిటోనేటర్లు, అమ్మోనియం సల్ఫేట్ వల్లే పేలుడు జరిగినట్లు అధికారులు తేల్చారు. వెంకన్న, సంపత్ అనే కూలీల కుటుంబం కొండల్లో డిటోనేటర్లు పేల్చేందుకు ఉపయోగిస్తారు. బండరాళ్లను విక్రయిస్తారు. ముందే ప్రమాదాన్ని పసిగట్టిన ఇద్దరు కూలీలు పిల్లలను తీసుకొని బయటికి పరిగెత్తారు.

ఈ పేలుడు ఘటనపై ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అలాగే హోం శాఖ మంత్రి అనిత స్పందించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. డిటోనేటర్లు, గ్యాస్ పేలడం వల్ల ఐదుగురు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన మంత్రి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.