16 April, 2026 | 3:10 AM

హోటల్ బిల్లు కట్టలేక చేతులెత్తేసిన పాక్

16-04-2026 01:36 AM

అమెరికా ఇరాన్ చర్చలు.. గొప్పలకు పోయి తిప్పలు

ఇస్లామాబాద్, ఏప్రిల్ 15: అమెరికా చర్చలకు హోటల్ వేదికగా మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్ బిల్లు చెల్లించలేక చేతులెత్తేసింది. గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకుంది. ఇస్లామాబాద్‌లోని సెరెనా హోటల్ ఈ చర్చలకు వేదికైంది. యూఎస్, ఇరాన్, పాక్‌కు చెందిన ప్రతినిధులు భారీగా వచ్చారు. చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి. అతిథుల ఆహారం, అవసరాలు తదితరాలకు హోటల్ బిల్లు తడిసిమోపెడయ్యిందని పలు కథనాలు వెల్లడించాయి.

ఆ బిల్లుల్ని చెల్లించే స్థితిలోనూ షెహబాజ్ షరీఫ్ సర్కార్ లేదని ఆ కథనాలు వెల్లడించాయి. పాక్ దౌత్య ఆశయాలకు, ఆర్థిక అస్థిరతలకు ఈ కథనాలు అద్దం పడుతున్నాయి. కథనాలు తలనొప్పిగా మారడంతో ఆ హోటల్ యాజమాని తానే బిల్లులు వదులుకోవడం విశేషం. ఇప్పటికే పాక్ ప్రభుత్వం పలుమార్లు ఐఎంఎఫ్ ద్వారా రుణాన్ని తీసుకుంది, మరోమారు ఆశిస్తుంది. మరోవైపు ఖతార్ ప్రభుత్వం ఈ నెలాఖరులోగా తమతో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించాలని పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది. దీంతో పాక్ ఆర్థిక పరిస్థితి ‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’లా తయారైంది.