గాయకుడి కారులో 5 కిలోల డ్రగ్స్
- నిందితుడితోపాటు అనుచరుడి అరెస్ట్
- ఆస్ట్రేలియా డ్రగ్ రాకెట్ ముఠాతో సంబంధాలు
చండీగఢ్, మే 26: పంజాబ్ గాయకుడు హర్‌బీల్ సోహల్ కారులో 5 కేజీల డ్రగ్స్ లభ్యమవడంతో కలకలం రేగింది. పోలీసులు అతనితోపాటు, అతని అనుచరున్ని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ అంతర్జాతీయ ముఠా కేసులో దర్యాప్తు చేస్తుండగా ఈ గాయకుడి పేరు బయటికి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో సోదాలు చేస్తుండగా అతడి కారులో 5.1 కేజీల హెరాయిన్, రూ. 1,50,000 లభ్యమయ్యాయన్నారు. ఆస్ట్రేలియా, కెనడాకు చెందిన హ్యాండ్లర్లు నడుపుతున్న డ్రగ్స్ సరఫరా రాకెట్‌లో అతడు సరఫరాదారుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ మొత్తం డ్రగ్స్ నెట్‌వర్క్ ఆస్ట్రేలియా నుంచి పనిచేస్తోందని, దీనికి గ్యాంగ్‌స్టర్ జైపాల్ భుల్లర్ ముఠాతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. 2022లోనూ ఓ దోపిడీ రాకెట్ కేసులో హర్‌బీర్‌ను అరెస్టు చేశారు. డ్రగ్స్‌ను అక్రమంగా సరఫరా చేస్తున్న అక్షయ్ కుమార్ అనే వ్యక్తి వద్ద మార్చి 7న 301 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఈ రాకెట్‌తో సంబంధమున్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.






