అటవీశాఖపై 5 లక్షలకు దావా!
- పర్మిట్లు ఉన్నా వేధిస్తున్నారని కోర్టుకెళ్లిన లారీ యజమాని
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 23 (విజయక్రాంతి): అటవీశాఖ అధికారుల వసూళ్ల పర్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక లారీలకు అడ్డం తిరిగి, బిల్లులున్నా అడిగినంత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండ్రోజుల క్రితం మణుగూరు నుంచి ఓ లారీ ఇసుక లోడ్‌తో వెళ్తుంటే ఓ ఫారెస్టు బీట్ ఆఫీసర్ ఆపేశాడని తెలిసింది. ఇసుక అక్రమ రవాణా చేస్తున్నావని, డిపోకు లారీ తీసుకురావాలని డ్రైవర్‌పై ఒత్తిడి చేసినట్టు తెలిసింది.
తన వద్ద బిల్లు ఉందని, తాను డిపోకు రానని లారీ డ్రైవర్ స్పష్టంచేయడంతో వాగ్వాదం నెలకొన్నట్టు సమాచారం. అనంతరం బలవంతంగా లారీని ఫారెస్టు టింబర్ డిపోకు తరలించాడు. ఇసుక తరలింపునకు పర్మిట్లు ఉన్నా లారీనీ డిపోలో ఉంచినందుకు ఫారెస్ట డిపార్టుమెంట్‌కు రూ.5 లక్షల పరువునష్టం దావా వేసినట్టు తెలిసింది. దీంతో అధికారులు తలలు పట్టుకన్నట్టు సమాచారం. ఈ విషయమై ఫారెస్టు రేంజీ అధికారి అనిల్‌కుమార్‌ను వివరణ కోరగా అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న లారీని పట్టుకొన్న మాట వాస్తవమే నని, కేసు నమోదు చేయకుండా మైనింగ్ ఏడీకి అప్పగించామని తెలిపారు.






