19-01-2026 12:00:00 AM
ఖరారైన రిజర్వేషన్లు
మహబూబాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ జిల్లాల కలెక్టర్లు వార్డు కౌన్సిలర్ పదవుల కు డ్రా పద్ధతి ద్వారా రిజర్వేషన్ల ప్రక్రియ నిర్వహించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, 2019 మున్సిపల్ చట్టం ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 12 మున్సిపాలిటీల చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికార వర్గాలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.
ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైనా ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడానికి సన్నద్ధంగా ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ పదవులకు పోటీపడేందుకు తమకు అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చిన నాయకులు ఎన్నికల బరిలో నిలవడానికి అప్పుడే సన్నాహాలు ప్రారంభించారు. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా రానిచోట మరికొందరు తమ కుటుంబ సభ్యులను పోటీకి నిలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వార్డు కౌన్సిల్ పదవుల్లో తమకు ప్రాబల్యం ఉన్నచోట పోటీ చేయడానికి అప్పుడే కొందరు రాజకీయ నాయకులు పావులు కదుపుతున్నారు.
మున్సిపల్ చైర్మన్‌ల రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి
మహబూబాబాద్ - ఎస్టీ జనరల్
కేసముద్రం - ఎస్టీ మహిళ
స్టేషన్ ఘనాపూర్ - ఎస్సీ జనరల్
డోర్నకల్ - ఎస్సీ జనరల్
జనగామ - బీసీ జనరల్
భూపాలపల్లి - బీసీ జనరల్
ములుగు - బీసీ మహిళ
నర్సంపేట - బీసీ మహిళ
పరకాల - ఓసి జనరల్
తొర్రూర్ - ఓసి జనరల్
వర్ధన్నపేట - ఓసి జనరల్
మరిపెడ - ఓసి మహిళ
మహబూబాబాద్ జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలోని వార్డుల రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.
మహబూబాబాద్ (36)
ఎస్టీ మహిళలకు 4, 5, 26, ఎస్టీ జనరల్ కు 11,15,17,20, ఎస్సీ మహిళలకు 23,25, ఎస్సీ జనరల్ కు 2,9,24, బీసీ మహిళలకు 1,22,32, బీసీ జనరల్ కు 12,13,36, ఓసి మహిళలకు 6,7,10,16,19,21,27,30,31, 35, ఓసి జనరల్ కు 3,8,14,18, 28,29,33, 34 వ వార్డులను కేటాయించారు.
కేసముద్రం (16)
కేసముద్రం మున్సిపాలిటీలో ఎస్టి మహిళకు 15, ఎస్టీ జనరల్ కు 2,3, ఎస్సీ మహిళకు 8, ఎస్సీ జనరల్ కు 4, బీసీ మహిళకు 10, బీసీ జనరల్ కు 6,12, ఓసి మహిళలకు 1,5,9,13 , ఓసి జనరల్ కు 7,11,14 వ వార్డులను కేటాయించారు.
డోర్నకల్ (15)
డోర్నకల్ మున్సిపాలిటీలో ఎస్టీ మహిళలకు 2,14, ఎస్టీ జనరల్ కు 7,8, ఎస్సీ మహిళకు 6, ఎస్సీ జనరల్ కు 9,15, ఓసి మహిళలకు 4,5,10,11, ఓసి జనరల్ కు 1,3,12,13 వార్డులను కేటాయించారు. ఇక్కడ బీసీలకు ఒక్క కౌన్సిల్ కేటాయించలేదు.
మరిపెడ (15)
మరిపెడ మున్సిపాలిటీలో ఎస్టి మహిళలకు 7,9,10, ఎస్టి జంగల్ కు 3,11,14, ఎస్సీ జనరల్ కు 4, ఓసి మహిళలకు 2,6,8,13, ఓసి జనరల్ కు 1,5,12,15 కౌన్సిలర్ పదవులను కేటాయించారు. ఇక్కడ ఎస్సీ మహిళకు, బీసీలకు ఒక్క వార్డు కూడా కేటాయించలేదు.
తొర్రూర్ (16)
మున్సిపాలిటీలో ఎస్టి మహిళకు 12, ఎస్టీ జనరల్ కు 16, ఎస్సీ మహిళకు 9, ఎస్సీ జనరల్ కు 3,7, బీసీ మహిళకు 14, బీసీ జనరల్ కు 2,10, ఓసి మహిళలకు 1,6,8,13,15, ఓసి జనరల్ కు 4,5,11 వ వార్డులను కేటాయించారు.