19-01-2026 12:00:00 AM
డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్
మహబూబాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, విద్యా, వైద్యం, రోడ్లు, తాగునీటి వసతి మెరుగుల కోసం ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల గ్రామంలో నూతనంగా నిర్మించిన రోడ్డును ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
రోడ్డు సౌకర్యం మెరుగుపడితే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభమవుతుందని పేర్కొన్నారు. బలపాల గ్రామ ప్రజలకు ఈ రోడ్డు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుందన్నారు. ప్రభుత్వం గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని, రాబోయే రోజుల్లో మరిన్ని మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.