26 June, 2026 | 1:46 AM

ఆధునిక నగరాల్లో అకాల వరదలు

26-06-2026 12:00 AM

దుప్పటి మొగిలి :

* ఒకప్పుడు వర్షం అంటే ఆనందం. రైతుకు ఆశ, ప్రకృతికి పునరుజ్జీవనం, నగరానికి చల్లదనం. కానీ, నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గ్లోబల్, స్మార్ట్ సిటీలు, ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తుల భవనాలు, సాఫ్ట్‌వేర్ కారిడార్‌లు కలిగి ఉన్న ఆధునిక భారతీయ నగరాలు చినుకు పడితే చాలు వణికిపోతున్నాయి. వానకాలం వచ్చిందంటే చాలు ఈ రంగుల ప్రపంచం వెనుక ఉన్న అసలు రంగు వెలవెలబోతుంది.

కోట్లాది రూపాయల సంపదకు కేంద్రాలైన మహానగరాలు, రెండు గంటల వర్షానికే చెరువులను తలపిస్తూ, చేష్టలుడిగిపోతున్నాయి. గంటల వ్యవధిలోనే రహదారులు నదులుగా మారుతున్నాయి. వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ఇళ్లు, దుకాణాలు, ఆసుపత్రులు, మెట్రో స్టేషన్లు నీటిలో చిక్కుకుంటున్నాయి. 

ఒకప్పుడు ప్రకృతి వైపరీత్యంగా భా వించిన వరదలు ఇప్పుడు నగరాల నిత్య సమస్యగా మారాయి. ఈ సమ స్యను కేవలం ప్రకృతి మీద నెట్టివేయడం సరైంది కాదు. వాతావరణ మార్పుల ప్ర భావం, వర్షపాతం పెరిగిన మాట నిజమైనప్పటికీ నగ రాల దుస్థితికి అసలు కార ణం ముమ్మాటికీ మానవ తప్పిదమే. వ్యవస్థల నిర్లక్ష్యం, ప్రణాళికారహిత పట్టణీకరణ, ప్రజల బాధ్యతారాహిత్యం కలిసి సంయుక్తంగా నిర్మించిన కృత్రిమ విపత్తే ఇప్పుడు నగరాలను ముంచెత్తుతున్న వరదలు.

గడిచిన ఐదేళ్లలో దేశంలోని ముంబాయి, చె న్నై, హైదరాబాద్‌లలో సంభవించిన జలప్రళయాలు ఈ చేదు నిజాన్ని కళ్లకు కడు తున్నాయి. దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబయి నగరంలో ఏటా వ ర్షాకాలం ఒక పీడకలగా మారుతోంది. భా రీ వర్షాలకు లోకల్ రైళ్లు స్తంభించి, సబర్బన్ ప్రాంతాలు పూర్తిగా మునిగిపోతు న్నాయి. ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతింటు న్నాయి. ముంబయి చుట్టూ ఉన్న మడ అ డవులు ఒకప్పుడు సహజ వరద నియంత్ర ణ వ్యవస్థ. అవి వర్షపు నీటిని గ్రహించి తుఫాన్ల ప్రభావాన్ని తగ్గించేవి. కానీ, అవి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు బలయ్యాయి.

చెన్నై పరిస్థితి కూడా అంతే. వర్షాకా లంలో చెన్నై ఐటీ కారిడార్ సహా సగానికి పైగా నగరం నీటిలోనే ఉండిపోయింది. చెన్నై ఒకప్పుడు వేలాది చెరువుల నగరం. కానీ, నేడు ఆ చెరువులపై కాలనీలు, షా పింగ్ మాల్స్, అపార్ట్‌మెంట్లు వెలిశాయి. నీరు నిల్వ ఉండే ప్రాంతాలను కాంక్రీటు తో కప్పివేయడంతో వర్షపు నీరు వెళ్లేందుకు మార్గం లేకుండాపోయింది. నదు లు, కాలువలు కుంచించుకుపోయాయి. 

ఇక గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్ పరిస్థితి మరీ దారుణం. ఏటా అ నేక కాలనీలను వరదలు ముంచెత్తుతున్నా యి. ఇటీవల కురిసిన సాధారణ వర్షానికే నగరంలోని ప్రధాన కూడళ్లు, బేగంపేట, ఖైరతాబాద్ వంటి ప్రాంతాలు నదులను తలపించాయి.

వివిధ నగరాలలో గత ఐదేళ్లలో వందలాది ప్రాణాలు గాల్లో కలవడమే కాకుం డా, వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఈ దుస్థితికి ప్రధాన కార ణం అధికారులు, ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలే. వర దలు వచ్చినప్పుడే మేల్కొనే యంత్రాం గం ఆ తర్వాత సమస్యను గాలికొదిలేస్తోంది. కోట్లాది రూపాయల బడ్జెట్లతో నాలా విస్తరణ, వరద నీటి కాలువలు వంటి పథకాలను కాగితాలపై ప్రకటిస్తున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో వాటి అమలు శూన్యం. ఒక రహదారిని నిర్మించేటప్పుడు శాస్త్రీయంగా ఉండాల్సిన ‘గ్రేడియంట్’ (నీరు ప్రవహించే వాలు)ను అస్సలు పట్టించుకోవడం లేదు.

పాత రోడ్డుపైనే కొత్త నిర్మాణాలు చేపడుతుండటం వల్ల ఇళ్ల మట్టం కంటే రోడ్ల ఎత్తు పెరిగి, వర్షపు నీరంతా ఇళ్లలోకి, కాలనీలలోకి చేరుతోంది. నగర మాస్టర్ ప్లాన్లను తుంగలో తొక్కి, చెరువుల శిఖం భూములను, బఫర్ జోన్లను రియల్ ఎస్టేట్ వ్యాపారుల లాభాల కోసం అక్రమ లేఅవుట్లుగా మారుస్తుంటే, అధికారులు కళ్లు మూసుకుని అనుమతులు ఇస్తున్నారు. నగరపా లక సంస్థలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల అవినీతి, తీవ్ర నిర్లక్ష్యం ఈ నగరా లను ముంచేస్తున్నాయి.

వర్షాకాలం ముగిసిన వెంటనే ప్రారంభం కావాల్సిన నా లాల పూడికతీత పనులు, మే లేదా జూన్ నెలలో నామమాత్రంగా చేపడతారు. కాం ట్రాక్టర్ల బిల్లుల కోసమే ఈ పనులు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. నాలాల ఆక్రమణలను తొలగించడంలో ప్రజాప్రతినిధులు తమ ఓటుబ్యాంకు రాజకీయాల కోసం అడ్డుపడుతుంటారు. ఒక నాలా విస్తరణ చేయాలంటే రాజకీయ ఒత్తిళ్లు, కోర్టు స్టేల సాకులు చూపిస్తూ సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తారు.

డ్రైనేజీ వ్యవస్థలను, ఐటీ కారిడార్ల మౌలిక వసతులను ఆధునీకరించకుండా కేవలం ఫ్లైఓవర్లు, అందాల అలంకరణలకే ప్రాధాన్యత ఇవ్వడం అధికారుల ప్రాధాన్యతా లోపానికి నిదర్శనం. అయితే, ఈ వినాశనంలో పాలకులను, అధికారులను మాత్రమే నిందిస్తే సరిపోదు. నగర పౌ రుల బాధ్యతారాహిత్యం కూడా అంతే స్థాయిలో ఉంది. నగరాల్లోని ప్రతి నాలా, ప్రతి డ్రైనేజీ మ్యాన్‌హోల్ ఈ రోజు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది.

ఈ వ్యర్థాలు వరద నీటి కాలువల అంచుల్లో పేరుకుపో యి నీటి ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకుంటున్నాయి. చిన్నపాటి వర్షం రాగానే నీరు కిందకి వెళ్లే మార్గం లేక రోడ్లపైకి పొంగిపొర్లుతోంది. చెరువులను, కుంటలను చెత్త డంపింగ్ యార్డులుగా మార్చడంలో ప్రజ ల పాత్ర తక్కువేమీ కాదు. హక్కుల గురిం చి గొంతెత్తే పౌరసమాజం సామాజిక బాధ్యతను, పర్యావరణ స్పృహను పూర్తిగా విస్మరించింది. 

ఇవే కాకుండా ఇప్పటివరకు పెద్దగా చర్చకు రాని మరికొన్ని కీలకమైన అంతర్గత సమస్యలు కూడా నగరాలను ముం చుతున్నాయి. అందులో మొదటిది కాంక్రీటీకరణ. నగరాల్లోని ఖాళీ స్థలాలు, ఫుట్ పాత్‌లు, చివరకు ఇళ్ల ముందరి భాగాలను సైతం కాంక్రీట్ లేదా సిమెంటింగ్ చేయడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే మార్గమే లేకుండాపోయింది. రెండవది, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం.

మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డు వేస్తే, మరుసటి రోజే జలమండలి వారు పైపుల కోసం తవ్వుతారు, ఆ మరుసటి రోజు విద్యుత్ శాఖ లేదా టెలికాం సంస్థ వారు కేబుల్స్ కోసం తవ్వుతారు. ఈ తవ్వకాల వల్ల వచ్చిన మట్టి, వ్యర్థాలు డ్రైనేజీల లోకి చేరుతోంది. మూడవది కాలం చెల్లిన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలు. అప్పటి జనాభాకు తగినట్లుగా నిర్మించిన డ్రైనేజీలు, ఇప్పుడు పదింతలు పెరిగిన నగర జనాభా ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాయి.

ఇకనైనా పాలకులు, అధికారులు తాత్కాలిక ఉపశమన చర్యలు పక్కనపెట్టి, దీర్ఘకాలిక ప్రణాళికలతో వాతావరణ స్థితిస్థాపకత కలిగిన నగరాల నిర్మాణానికి పూనుకోవాలి. సహజసిద్ధమైన నీటి ప్రవాహ మార్గాలను పునరుద్ధరించడం, చెరువుల ఆక్రమణలను రాజకీయాలకు అతీతంగా తొలగించడం, ప్లాస్టిక్ వాడకంపై కఠినమైన నిషేధం అమలు చేయడం తక్షణ అ వసరం. అదే సమయంలో ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

స్మార్ట్ సిటీ అనే పదం నేడు బాగా ప్రాచుర్యం పొందింది. వర్షం పడితే మునిగిపోయే నగరం నిజంగా స్మార్ట్ నగరమా? లక్షల మంది ట్రాఫిక్‌లో చిక్కుకుంటే, ఆసుపత్రికి అంబులెన్స్ చేరలేకపోతే, నీరు వెళ్లే దారి లేకపోతే అది స్మార్ట్ నగరమా? స్మార్ట్ సిటీ అంటే డిజిటల్ బోర్డులు కాదు. ప్రకృతితో సహజీవనం చేయగలిగే నగరమే నిజమైన స్మార్ట్ సిటీ. నగరాలను భవనాలు నిర్మించవు.

నగరాలను నీటి వ్యవస్థలు, చెరువులు, వాగులు, కాలువలు నిర్మిస్తాయి. వాటిని నాశనం చేస్తే నగరం ఎంత సంపన్నమైనా చివరకు నీటిలోనే నిలబడాలి. ఒక నగరాన్ని నిర్మించడం అంటే కేవలం భవనాలు కట్టడం, రోడ్లు వేయడం, ఫ్లైఓవర్లు నిర్మించడం కాదు. నగరాన్ని నిర్మించడం అంటే భవిష్యత్తును నిర్మించడం. ప్రకృతికి స్థానం లేని నగరానికి భవిష్యత్తు ఉండదు. హైదరాబాద్ వరదలు మనకు నేర్పుతున్న పాఠమిదే.

 వ్యాసకర్త సెల్: 8466826118