26 June, 2026 | 1:47 AM

సబ్బండ కులాల సవార్ల పండుగ

26-06-2026 12:00 AM

నేడు పీర్ల పండుగ :

* తెలంగాణల పీర్ల పండుగ అంటే ఇంటింటికి పండుగే. కులమతాలు, వర్గాలనొదిలి హిందువులు, ముస్లింలు అన్నదమ్ముల్లా యాడాదికోసారి జరుపుకొనే సంబురం పీర్ల పండుగ. ఆ పది రోజులు పీర్లను ఎత్తెటోల్లంతా ఉపవాసాలు ఉంటరు. ఊర్లన్ని ఊదు, సాంబ్రాణి గగ్గరుపత్తులతో కమ్మని వాసనలు. జాగకో పీరు, ఇంటికో పీరు, కులానికో సవారును నిలబెడుతరు. 

‘అమ్మా బీబి ఫాతుమ్మ లారా

అక్కడి కొనలు ఇక్కడ వాలే

ఇక్కడి కొనలు అక్కడ వాలే

అమర భీం ఫాతిమ్మ లారా’

‘ఏమేమి గావాలి స్వామికి

‘అస్సోయి దూలా దూలా అయిదోస్! మూడోసు! రెండోసు! దూలా దూలా’

అమావాస్య పోయిన మల్తనాడు నెలపొడుపు చంద్రున్ని చూస్తే సందు చూసినట్లు లెక్క. ఆ రాత్రే పీర్ల పెట్టెలను కిందకి దించి ఊరేగిస్తరు. సాకలోళ్లు ఎర్రమన్ను సున్నం అలుకు పూతలతో పీర్ల చావిళ్లను పెండ్లి పందిళ్లలా ముస్తాబు చేస్త రు. ఎడమ చేతుల తువ్వాలలు కుడి చేతు ల నెమలికట్టలు మెడల నల్లటి మపులర్ కాళ్లకు గజ్జెలు, మెడల మీద చేతులేసుకొని భుజాలు పెనేసుకొని అయిదొరుసల అ లాయ్ చుట్టూ ఆటపాటలు...

‘ఊశన్న పు ట్టినప్పుడు ఊరు పుట్టే/ ఆశన్న పుట్టినప్పుడు అలాయి పుట్టే.’ చెట్టు పూలను రాసి పోసినట్లు ఊరంతా ఒక్క తాన బొడ్డయితది. ఆకాశాన్ని తాకే మంటలు. దన దన డప్పుల దరువులు. భూమి నిప్పుల గుండ మై దగ దగ సెగలు. గొంతులన్ని ఒక్కటైన పాట. దరువులు అన్ని ఒక్కటైన ఆట. ఘల్లు ఘల్లున గజ్జెలన్ని ఒక్కటైన దోస్తరాదీన్. దూలా! దూలా! సీటిలు, అరుపులు, ఎవరిని పట్టవశం గాదు. అందరి సుతి స్తుతి పీర్లే. 

సూర్యనికెందుకంత తొందర ఇప్పుడే రాకుంటే బాగుండేదనుకోనేది రాత్రి. తెలంగాణల పీర్ల పండుగ ఇంటింటికి పండుగే. కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలనొదిలి హిందువులు, ముస్లింలు అన్నదమ్ముల్లా ఆనందంగా యాడాదికోసారి జరుపుకొనే సంబురం పీర్ల పండుగ. గుంపులుగా గుమిగూడి పీర్ల పోరాట కథలను, సత్యాలను మాట్లాడుకుంటారు. ఆ పది రోజులు పీర్లను ఎత్తెటోల్లంతా ఉపవాసాలు ఉంటరు. ఊర్లన్ని ఊదు, సాంబ్రాణి గగ్గరుపత్తులతో కమ్మని వాసనలు.

ఇంటింటికి సవారే. జాగకో పీరు, ఇంటికో పీరు, కులానికో సవారును నిలబెడుతరు. ఉక్కుసవారు, వెండి సవారు, కత్తుల సవారు, పిల్లల సవారు, బంగారు సవారు, అయిదుకొమ్ముల సవార్లు.. ఇంకా ఎన్నెన్నో పేర్లు. ముస్లింలే మొల్లలుగా, ముజావర్లుగా (పూజారులు) ఫాతేహలు ఇస్తరు. హిందువులే పీర్లేత్తుతరు. పీర్లను నిలబెట్టిన ఎంబడే చావిడికి ఎదురుగా గుండ్రంగా అలావా తోడుతరు.

చింత మొద్దులను బండ్లమీద తెచ్చి కొప్పుగా పేర్చితే తెల్లారిందాక మంటలే, అలాయిల నిండా నిప్పుల రాశులే. నిప్పుల సెగలు, కణకణ తప్పట్లు, డప్పులు మజీలు దరువులై మోగుతుంటే పాటలు పండువెన్నెలై కురుస్తది. జోరుగా దరువులతో అలాయి కమ్మినప్పుడు పీర్లెత్తెటోళ్లకు తురుక దేవుడు పయిమీదికొస్తడు. దోస్తరాదీన్ అంటూ పయినిండుతరు.

అలాయిలంగా పోవాలని కొందరు, నిప్పు లు కాలలేదు ఇప్పుడే వద్దని ఇంకొందరు జగడాలు, తోసుకోవడాలు చెవుల గల్లు పడ్డట్లే, ఎవరి హుషారుల మాటలు వాళ్లు మాట్లడుతున్నప్పుడే సర్రున నిప్పులమీద నిలబడి దోస్తరాదీన్ అంటూ శిగమూగుకుంటూ వెల్తడు. నిప్పులమీద నడుస్తూ దోసిల్లనిండా నిప్పుల్ని తీసుకోని ఆకాశంలోకి చల్లితే మంచి మల్లెలై రాలేవి అంటూ ఎన్కటి పెద్దల ముచ్చట్లు.

పెద్దసరుగతి (తొమ్మిదొద్దులు) 

తొమ్మిదొద్దుల అందరూ మట్కీల్లు చేస్తరు. కుమ్మ రోల్ల ఇంటికిపోయి కొత్తకుండ, గురుగులు, ఫాతేహల చిప్పలు తెచ్చి, నిండు కడువ నీళ్లు పోసి బెల్లం, సోపు, గగ్గరుపత్తులు, పుట్నాలను కలిపి మట్కీళ్లు చేస్తరు. తడి కోకలమీద డప్పుదరువులతో తీసుకెల్లి సవార్లకు సదివిస్తరు. దీనినే షర్భత్, పాన కం అంటరు. కొత్తుబియ్యాన్ని పిండి పట్టిం చి రొట్టెలు గొట్టి నెయ్యి బెల్లం గగ్గరుపత్తులు కలపి ముద్దలు కడుతరు. వాటినే మలీదలు అంటారు. మల్లెలు చామంతులు కలిపిన పూల షేరాలు, గంధం మెరుపుల రంగురంగుల ఆకుపచ్చ ఎరుపు దట్టీలు లాడేలతో పీర్లను అలంకరించి భక్తిశ్రద్ధలతో ఫాతెహాలిచ్చి కొలుస్తారు.

మొక్కుబడులు (దట్టీలు, బెల్లం): కోర్కె లు తీరిన భక్తులు పీర్లకు రంగురంగుల పట్టు వస్త్రాలను దట్టీలుగా సమర్పిస్తారు. స్వామివారికి ‘బంగారం’ పేరుతో బెల్లాన్ని నైవేద్యంగా పెడతారు.

మొల్లాయినకు టెంకాయలు కొట్టి కొట్టి చేతులు గుంజుతవి. సమంగా పలుగుతే సంసారం బాఢయితదని, కోలగ పలుగుతే సంతానం కలుగుతదని నమ్మకం.

పదోసరిగత్ (పదొద్దంలు): పదొద్దుల పీర్లను ఎత్తెటోళ్లను ఇంట్ల కాడినుంచి డప్పు చప్పుళ్లతో తోలుకొస్తరు. అలావు నిప్పుల్ని తొక్కి మసీదెక్కాలి. తెల్లని పయింట్ అంగి బుశోటు తొడ్కోని, నెత్తికి రుమాలు చెట్టుకోని మెడల సంచులేసుకోని, నడుము లకు కాశ నవారు బిగ్గరగా గట్టుకోని తయారైతరు. వెనుకాళ్లనే డోరి పట్టడానికి తయారుగుంటరు. తెల్లవారుజామున  మూడుగొట్టంగనే మసీదుల నుంచి సవార్లను లేపుతరు. యాటెనుక యాట తెగు తనే ఉంటది.

పీరెనుక పీరు లేస్తనే ఉంటది. అక్కడి నుంచి అయిదు సుట్లు ఆలావు తిరిగి సక్కగా అవుసలోల ఇంటికి పోతవి. పీర్లు తయారయ్యేది అవుసలోల ఇంటికాడనే కాబట్టి అక్కడ కోయి ఫాతేహలిచ్చి నంకనే ఊరు తిరుగడం మొదలు పెడుతరు. ఊర్లల్ల ఇంటింటికి పీరు పోవాలే. పీర్లు ఇంటికొస్తే దేవుడు ఇంటికొచ్చినట్లే. ఉట్టిగ పంపొద్దని ప్రేమగా ఇష్టంగా వంద నో, అయిదొందల నోటునో దట్టిలకు దం డగా కుచ్చేస్తరు.

మద్యానం ఏబుజ్జి తలకాయ కొట్టెటప్పుడు ఏ ఊరిలనైనా ఒక యుద్ధ వాతావరణం. బొడ్రాయికాడ ఒక కట్టెకు చిన్న కుండపెట్టి నిండుగ వరిగడ్డి చుడ్తరు. ఊరి మీది సవారు వచ్చి కుండను కొట్టంగనే పీర్లన్ని ఒక్కసారిగా కింద పడిపోతయి. ఎంబడే సవార్లను దించి మొఖా లు కన్పడకుండా దట్టిలను కప్పుతరు. అలావును పూడ్చి మట్టిపై ఒక దివిటిని దానిమ్మ కొమ్మను ఉంచుతరు. 

పొద్దింకల పీర్లను లేపినాక ఊరి రచ్చకట్టల దగ్గర పీర్లన్నిఒక్క తానికై అలాయి బలాయి ఆడుతయి. ఒక పీరును మరో పీరుకు భుజం భుజం కలుపుతరు. సంచులనిండా బొంగులతెచ్చి కొంగులనిండా పోసుకోని పీర్లు ఆడినంత సేపు చల్లుతరు. పొద్దు పోతున్నది పీర్లు బాయికోవాలని పెద్దమనుషులు తొందర పెడ్తరు. రాత్రిల్ల ఆడుకుంట ఆడుకుంట పీర్లు బాయికోతుంటే ప్రజలు తల్సుక తల్సుక వలపో స్తరు. భక్తులు నేలపై పడుకుంటే పీర్లు దాటిపోతుంటయి. పీర్లను ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువుల్లో లేదా బావుల్లో నిమజ్జనం చేయడంతో ఈ శోక ఉత్సవాలు ముగుస్తాయి.

అర్ధరాత్రి పీర్లు చెరువులో కడిగిన తరువాత భక్తులు తెచ్చిన పెరుగు సద్దులను ఒక్క సద్దిగా కలిపి ప్రసాదంగా అందరికి పంచుతరు. అనంతరం దట్టిల్లో సవార్లను మూటలుగట్టి నెత్తిమీద పెట్టుకోని ఒక్కొక్క అడుగేస్తూ... ‘అల్ విదాయో అల్ విదా యో సైదా.. అల్ విదాయో అల్ వి దాయో..’ అంటూ షహాదత్ యుద్ద దుఖగీతాన్ని పాడుకుంట విషాద వదనాలతో చావిడికి చేరుకుంటరు.

ముజావరు సం చిలో ఉన్న బెల్లం పచ్చి కొబ్బర మలీదనంతా మహాప్రసాదంగా ఊరందరికి పం చుతరు. ఒక్కరోజు తరువాత బొంగులు పుట్నాలను సమర్పిస్తూ జారతుల పండుగను చేసి సవార్లను మల్ల యథావిధిగా పెట్టెలల్ల పెట్టి మసీదులో ఉంచుతరు. పీర్లు ఆరునెలలు రాకడ ఆరు నెలలు పోకడం టూ... అయిపాయే బడే సాబ్ పీర్ల పండుగంటూ మళ్లొచ్చే పండుగ కోసం ఎదిరి చూస్తారు.

వనపట్ల సుబ్బయ్య

 వ్యాసకర్త సెల్: 9492765358