30 July, 2026 | 9:50 PM

కాళేశ్వరం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

30-07-2026 09:19 PM

మెడిగడ్డకు 2.21 లక్షల క్యూసెక్కుల వరద

కాళేశ్వరం,(విజయక్రాంతి): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఉదయం సుమారు లక్ష క్యూసెక్కులుగా ఉన్న వరద ప్రవాహం సాయంత్రానికి గోదావరి–ప్రాణహిత నదులు కలిసి 2.21 లక్షల క్యూసెక్కులకు చేరింది.

ప్రస్తుతం నది 7.55 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. ఈ వరద నీరు మెడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి చేరుతుండగా, బ్యారేజీకి 2.21 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తూ అధికారులు 85 గేట్లను ఎత్తి ఉంచారు. మరో 24 గంటల్లో గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి దిగకుండా, వరద ప్రవాహాలకు దూరంగా ఉండాలని సూచించారు.