సుతారిగూడ చెరువు నుంచి ప్రవహిస్తున్న
- మురుగునీటి కాలువను నిలిపివేయాలి
- బీజేపీ నేత నర్సింగ్ రావు
మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 23(విజయక్రాంతి): సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని సుతారిగూడ చెరువు నుండి ప్రవహిస్తున్న మురుగునీటి కాలువను నిలిపివేయాలని మేడ్చల్ మున్సిపల్ పట్టణ బిజెపి నాయకులు నర్సింగ్ రావు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని కండ్లకోయ మున్సిపల్ పట్టణంలో గల సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న సుమారు 5 నుండి 6 వేల మంది విద్యార్థిని విద్యార్థులు ఉపయోగించిన మరుగుదొడ్ల మురుగు నీటిని సుతారీ గూడ చెరువులో వదులుతున్నారని ఆయన చెప్పారు.
అంతే కాకుండా సుతారీ గూడ చెరువులోకి సీఎంఆర్ కళాశాల నుండి వస్తున్న మురుగు నీటి కాలువను మేడ్చల్ పెద్ద చెరువులో కలుపుతున్నారని ఆయన జిల్లా కలెక్టర్, ఇరిగేషన్, తహసిల్దార్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ లకు వినతి పత్రం అందజేసినట్లు వెల్లడించారు.ఈ నేపథ్యంలో సుతారిగూడ చెరువు నుండి మేడ్చల్ పెద్ద చెరువులోకి ప్రవహిస్తున్న మురుగునీటి కాలువను తొలగించి పెద్ద చెరువు పరిశుభ్రతను కాపాడాలని నర్సింగ్ రావు జిల్లా కలెక్టర్ ను కోరినట్లు చెప్పారు.
సుతారి గూడ చెరువు నుండి మేడ్చల్ పెద్ద చెరువులోకి కలుస్తున్న మురుగు నీటి వల్ల మేడ్చల్ పెద్ద చెరువు కలుషితమై పశువులకు బట్టలు ఉతికే వారికి పనికిరాకుండా పోతుందని నర్సింగ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు స్పందించి సుతారిగూడ చెరువు నుండి వస్తున్న మురుగు నీటి కాలువను నిలిపివేసి మేడ్చల్ పెద్ద చెరువుకు న్యాయం చేయాలని ఆయన కోరారు.






