విధుల నిర్లక్ష్యంపై అంగన్వాడీ టీచర్ సస్పెన్షన్
లబ్ధిదారులకు సేవల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్న కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి,ఆగస్టు 16(విజయక్రాంతి): అంగన్వాడీ సేవల అమలులో నిర్లక్ష్యం, కేంద్రం నిర్వహణలో లోపాలు, విధుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఓదెల–II అంగన్వాడీ కేంద్రం టీచర్ జె. ప్రమీలను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్, ఇన్‌చార్జి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి కోయ శ్రీహర్ష తెలిపారు.
అంగన్వాడీ టీచర్ జె. ప్రమీల విధుల నిర్వహణపై సూపర్‌వైజర్ నివేదిక ఆధారంగా పలు ఆరోపణలు వచ్చినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందించాల్సిన ప్రభుత్వ సేవల అమలులో నిర్లక్ష్యం వహించడంతో పాటు, ముందస్తు సమాచారం లేకుండా అంగన్వాడీ కేంద్రాన్ని మూసివేసినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.
ఆరోపణల తీవ్రతను, లబ్ధిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, విషయం పూర్తిగా పరిశీలించబడే వరకు జె. ప్రమీలను అంగన్వాడీ సేవల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
సస్పెన్షన్ కాలంలో ఓదెల–II అంగన్వాడీ కేంద్రం సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అందుబాటులో ఉన్న మరో అంగన్వాడీ టీచర్‌కు కేంద్రం పూర్తి బాధ్యతలు అప్పగించాలని సంబంధిత సూపర్‌వైజర్‌ను ఆదేశించారు. సీడీపీవో, సంబంధిత సూపర్‌వైజర్ ఉత్తర్వులను తక్షణమే అమలు చేసి నివేదిక సమర్పించాలని సూచించారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందించే పౌష్టికాహారం, గుడ్లు, ఇతర సంక్షేమ సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. అంగన్వాడీ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా చూడాలని ఆదేశించారు.






