మట్టిమాటున గుట్టకు ఎసరు!
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ ౭ (విజయక్రాంతి): ప్రభుత్వ శాఖల అనుమతితో పనిలేకుండా కోట్ల విలువైన మట్టి దందా జరుగుతున్నా అధికారులు మామూళ్ల మత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గోరంత అనుమతులను అడ్డం పెట్టుకొని మట్టి మాఫియా కొండంత జరుగతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. మండల స్థాయి అధికారులకు నెలసరి మామూళ్లు ముట్టచెప్పి అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఫలితంగా గుట్టలు తరిగిపోయి, వ్యవసాయ భూముల్లో 20 అడుగుల లోతు తవ్వకాలు జరుగుతున్నా అధికారులు ఏం పట్టనట్లు వ్యవహరించడం ఆరోపణలను ధృవపరుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ 7వ దశకు చెందిన పుల్లాయిగూడెం యాష్‌పాండ్ అభివృద్ధి పనుల్లో గోరంత అనుమతితో కొండంత అక్రమాలు జరుగుతున్నాయి. రూ.25కోట్లతో ఈ పనులు చేపట్టారు.
బూడిద చెరువును మూడు కిలో మీటర్ల పొడవున 5 అడుగుల ఎత్తు పెంచి, రాళ్లతో రివిట్‌మెంట్ చేయాల్సి ఉంది. ఈ పనులకు అవసరమైన మట్టిని సమీపంలోని రైతు పొలంలో తవ్వకాలు చేస్తున్నామని చూపుతూ, సమీపంలో గుట్టను తొలిచి అక్రమంగా రూ.కోట్ల విలువగల మట్టిని రేయింబవళ్లు తోలుతున్నారు. వాస్తవంగా మట్టి తోలకం జరగాలంటే మైనింగ్ అధికారుల అనుమతి తప్పని సరి, వ్యవసాయ భూమిలో తవ్వకాలు జరగాలంటే రెవెన్యూ అధికారుల అనుమతి తప్పని సరి, ఇసుక తోలకాలు చేయాలంటే టిఎస్‌ఎండిసీ అధికారుల అనుమతి తప్పని సరి. కానీ బూడిదచెరువు అభివృద్ధికి ఎవరి అనుమతి లేకుండా స్థానిక అధికారులను ప్రలోభాలకు గురిచేసి భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారు.
ఇంత జరుగుతున్నా జిల్లా అధికారుల దృష్టికి పోలేదంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇప్పటికే బూడిదచెరువులో సుమారు 30 లక్షల టన్నుల మట్టిని గుట్టలుగా నింపిన అధికారుల కళ్లకు మాత్రం కన్పించడంలేదు. భారీ యంత్రాలతో మట్టిని తవ్వి రోజుకు పదుల సంఖ్యలో లారీలతో తరలిస్తున్నారు. దీంతో సమీపంలోని గుట్టలు నేలమట్టమవుతున్నాయి. మరోవైపు వ్యవసాయ భూముల్లో మట్టిని పారదర్శకంగా ఉంచాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నా వారి సలహాలను తుంగలో తొక్కి మట్టి మాఫియా 20అడుగుల లోతున తవ్వి మట్టిని అక్రమ రవాణా చేస్తున్నారు.ఫలితంగా ఆ భూమి వ్యవసాయానికి అనువుగా ఉండదని తెలుస్తోంది. రాత్రిపూట ఓవర్‌లోడ్‌తో మట్టిని తరలిస్తున్నా రవాణాశాఖ సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది.
ఇంత భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నా గల్లీ నుంచి జిల్లా వరకు ప్రజాప్రతినిధులు, మండలస్థాయి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటే మట్టి మాఫియా నుంచి ఏమేరకు మామూళ్లు ముట్టాయో ఇట్టే తెలుస్తోంది. బూడిదచెరువు నిర్మాణంలో అక్రమాలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించి, మట్టి మాఫియా ఆగడాలను నియంత్రించాలని, సహజ వనరులను పరిరక్షించాలని పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.






