1 August, 2026 | 4:52 PM

కోనరావుపేట మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు

01-08-2026 04:14 PM

- సమ సమాజ నిర్మాణమే లక్ష్యమని నాయకుల పిలుపు

కోనరావుపేట,(విజయక్రాంతి): గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో  ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి తో పాటు అనుబంధ సంఘాల నూతన కమిటీల ఏర్పాటు కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎగ్లాస్పూర్, శివంగలపల్లి, కొండాపూర్, వెంకట్రావుపల్లె గ్రామాల్లో నూతన కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు, కోనరావుపేట మండల ఇన్‌చార్జి యెలగందుల బిక్షపతి మాదిగ మాట్లాడుతూ, మూడు దశాబ్దాలుగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో రాజీలేని పోరాటం ద్వారా ఎస్సీ వర్గీకరణ సాధించడంతో పాటు మాదిగలు మరియు ఇతర పేద వర్గాల సంక్షేమం కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి పలు సంక్షేమ పథకాలు సాధించామని తెలిపారు.

మత దురహంకారం, కుల వివక్షత, సామాజిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణమే ఎంర్పీఎస్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలను గుర్తించి బలమైన ప్రజా పోరాటాలను నిర్మించాలని, మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లో ఎంర్పీఎస్ నూతన కమిటీల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని, నూతన తరాన్ని ఉద్యమంలోకి తీసుకువచ్చి శక్తివంతమైన ఉద్యమ శక్తిగా తీర్చిదిద్దేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.