1 August, 2026 | 4:56 PM

ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయండి

01-08-2026 04:11 PM

- అఖిలపక్ష పార్టీలు, ఆదివాసీ కుల సంఘాల పిలుపు

గుండాల,(విజయక్రాంతి): ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని అఖిలపక్ష పార్టీలు, మరియు ఆదివాసీ కుల సంఘాల ఆధ్వర్యంలో మండలం కేంద్రంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలిండియా ట్రైబల్ ఫోరం (ఏఐటీఎఫ్) జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం, ఆదివాసీ సంక్షేమ పరిషత్ (ఏఎస్పీ) జిల్లా అధ్యక్షులు వాగబోయిన చంద్రయ్య దొర లు మాట్లాడుతూ.. 1982 ఆగస్టు 9 జెనివాలో UN ఆదివాసీల కోసం జరిగిన తొలి కార్యవర్గ సమావేశానికి గుర్తుగా 1994 నుంచి ప్రతి ఏటా ఆగస్టు 9 ని ప్రపంచ ఆదివాసీ దినంగా జరుపుకుంటున్నారని అన్నారు.

అందులో భాగంగానే ఆగస్టు 9న మండల కేంద్రంలో జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల రక్షణ కోసం 1/70, పీసా చట్టాలు ఉన్నప్పటికీ వీటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. 1/70 యాక్టు, పీసా చట్టాలు ఉన్నప్పటికీ ఏజెన్సీలో హరితహారం, ఓపెన్ కాస్టుల పేరుతో అనేకమంది ఆదివాసీల భూములను ప్రభుత్వాలు ఎలాంటి పరిహారం లేకుండా గుంజుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

జీవో నెంబర్ 3 ద్వారా అనేకమంది ఆదివాసీ యువతి, యువకులకు ఉద్యోగాలు వచ్చాయని ఈ జీవో నెంబర్ 3ని కూడా రద్దు చేయడం ద్వారా ఆదివాసీ యువతీ, యువకులు ఎంతో నష్టపోయారని అన్నారు. ప్రత్యేకంగా ఆదివాసీల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏలలో కూడా గిరిజనేతరులు పెత్తనాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీల అస్తిత్వం, ఆదివాసీ చట్టాలు కాపాడుకోవడం కోసం కొమరం భీమ్ స్ఫూర్తితో ఆదివాసీ ప్రజలు, విద్యార్థి, యువకులు, ఆదివాసీ మేధావులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు గోవింద నరసింహారావు, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు పర్శిక రవి, గడ్డం లాలయ్య, కాంగ్రెస్ నాయకులు ఈసం పాపారావు, బీఆర్ఎస్ నాయకులు తెల్లం భాస్కర్, సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ నాయకులు కొమరం శాంతయ్య, తెల్లం రాజు, ఎఎస్పీ నాయకులు పూనెం రమణబాబు, కల్తి లక్ష్మణ్, బీజేపీ నాయకులు సోలం సతీష్, ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం (ఏటీపీఎఫ్) రాష్ట్ర నాయకులు ఈసం కృష్ణన్న తదితరులు పాల్గొన్నారు.