మాజీ డీజీపీ హెచ్‌డీ దొర కన్నుమూత
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ బాస్‌గా విధుల నిర్వహణ
నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన హన్మంతు జ్యోతి దొర
క్రమశిక్షణకు మారుపేరు.. పోలీస్ శాఖలో సమూల సంస్కరణల కర్త..
నా మొదటి బాస్.. నిబద్ధత కలిగిన అధికారి.. సీపీ సజ్జనార్ సంతాపం
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 13 (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాం గంపై తనదైన ముద్ర వేసిన ధీశాలి, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్‌జే దొర హన్మంతు జ్యోతి దొర కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
నాలుగు దశాబ్దాల పాటు పోలీస్ శాఖలో విశేష సేవలందించిన ఆయన, రాష్ట్రంలో నక్సలిజం పతాక స్థాయిలో ఉన్న సమయంలో శాంతిభద్రతలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల పోలీస్ శ్రేణులు, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాకుళం నుంచి శిఖరాగ్రం వరకు
1943లో శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన హెచ్ జే దొర 1965 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందినవారు. సుమారు 40 ఏళ్ల పాటు పోలీసు విభాగంలో వివిధ హోదాల్లో పనిచేశారు. అడిషనల్ డీజీపీగా తన ప్రతిభను చాటుకున్న ఆయన, 1996 నవంబర్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో అత్యధిక కాలం పోలీసు దళాధిపతిగా పనిచేసిన ఘనత ఆయనకు దక్కుతుంది.
ఉమ్మ డి రాష్ట్రంలో పీపు ల్స్ వార్ గ్రూప్ బలంగా ఉన్న రో జుల్లో దానిని సమర్థవంతంగా ఎదు ర్కోవడంలో దొర తనదైన వ్యూహాలను అమలు చేశారు. ఆయన డీజీపీగా బాధ్యతలు చేపట్టడానికి కొన్ని రోజుల ముందే ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్, ఉట్నూరు పోలీస్ స్టేషన్లపై నక్సల్స్ దాడి చేసి 16 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్నారు. అటువంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పగ్గాలు చేపట్టిన దొర, ఏమాత్రం బెదరక పోలీసు బలగాల్లో ధైర్యాన్ని నింపారు.
దళాల్లో వృత్తి నైపుణ్యాన్ని పెంచడంతో పాటు, నిరంతరం క్షేత్రస్థాయి సిబ్బందికి మార్గదర్శకత్వం చేస్తూ నైతిక స్థైర్యాన్ని అం దించారు. కాగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అంటే హెచ్‌జేదొరకు ఎంతో గౌరవం. ఎన్టీఆర్ హయాంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. వారి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎన్టీఆర్‌తో నేను.. అనే పుస్తకాన్ని కూడా ఆయన రచించారు. రాష్ట్ర సర్వీసుల అనంతరం ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లి అక్కడ కూడా తనదైన ముద్ర వేశారు.
నా మొదటి బాస్.. సీపీ సజ్జనార్...
హెచ్‌జే దొర మృతి పట్ల హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన నా మొదటి పోలీస్ బాస్. అత్యంత వృత్తి నైపుణ్యం, అంకితభావం కలిగిన గొప్ప నాయకుడిని మనం కోల్పోయాం. గతేడాది డిసెంబర్‌లో కూడా ఒక కార్యక్రమంలో ఆయనతో కలిసి వేదిక పంచుకోవడం నాకు దక్కిన గౌరవం అని సజ్జనార్ గుర్తు చేసుకున్నారు. పోలీస్ శాఖలో ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు నేటికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. హెచ్‌జే దొర కుటుంబ సభ్యులకు హైదరాబాద్ సిటీ పోలీస్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది అన్నారు.




