14 March, 2026 | 4:43 AM

మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు కన్ను మూత

14-03-2026 02:19 AM
  1. రెండుసార్లు సీపీఎం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో విషాద ఛాయలు

రంగారెడ్డి, మార్చి 13 (విజయక్రాంతి): ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న సీపీఎం సీనియర్ నాయకులు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాము లు (91) శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కన్నుమూయడంతో నియోజకవర్గంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మం చాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన రాములు, రాజకీయాలంటే ధనార్జన కాదు, ప్రజాసేవ అని నిరూపించిన అరుదైన నాయకుడు.

1989, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిగా వరుసగా రెండుసార్లు విజయం సాధించి, శాసనసభలో పేదల గొంతుకగా నిలిచారు. కాగా రాజకీయాల్లో ఉంటూ ఆస్తులు కూడబెట్టుకోవడం నేటి కాలంలో సామాన్యమైన విషయంగా మారిన తరుణంలో, రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఆయన సాధారణ జీవితాన్ని గడపడం అందరినీ ఆశ్చర్యపరిచే అంశం.

చివరకు డబ్బు లేక క్యాన్సర్ బారిన పడ్డ నా పెద్ద కుమారుడిని కూడా కాపాడుకోలేకపోయాను అని ఆయన గతంలో ఆవేదనతో పంచుకున్న మాటలు ఆయన నిబద్ధతకు సాక్ష్యంగా నిలుస్తాయి. చివరివరకు సొంత ఇల్లు కూడా లేకుండా, ప్రజా సమస్యల కోసమే పోరాడుతూ నిజమైన కమ్యూనిస్ట్ నాయకుడిగా జీవించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆయన కుమారుడు ఇబ్రహీంపట్నం 12వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా విజయం సాధించారు.

పలు పార్టీల నేతల ఘన నివాళి

కొండిగారి రాములు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతా పం వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  సంతాపం ప్రకటించారు. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు క్యామ మల్లేష్,

మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీంశేఖర్, సీపీఐ నాయకులు ఆందో జు రవీంద్రాచారి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. నైతిక విలువలతో కూడిన రాజకీయం చేసిన ఒక గొప్ప వ్యక్తిని జిల్లా కోల్పోయిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలో కుటుంబసభ్యులు, అభిమా నులు, పార్టీ శ్రేణుల మధ్య అంత్యక్రియలు ముగిశాయి.