మాజీ మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి వర్ధంతి
అంజలి ఘటించిన మహేశ్వరం చేవెళ్ళ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కాలే యాదయ్య
చేవెళ్ల ఏప్రిల్ 22 (విజయక్రాంతి): మాజీ మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి వర్ధంతిని చేవెళ్ల నియోజకవర్గంలోని కౌకుంట్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వారి కుటుంబ సభ్యులు టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గంలోని ఇంద్రారెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు.
ముందుగా చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని ఇంద్రారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఖానాపూర్ (ఇంద్రారెడ్డి నగర్) చిట్టంపల్లి చౌరస్తాలోని ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతిమంగా స్వగ్రామం కౌకుంట్ల రెవెన్యూలోని ఆయన సమాధి వద్దకు నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకుని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ... ఇంద్రారెడ్డి ముక్కుసూటి మనిషని ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో స్వరాష్ట్రం తెలంగాణ స్వరం వినిపించిన నాయకుడన్నారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందించారని గుర్తు చేశారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజాసేవ చేస్తూ... ఆయన అడుగుజాడల్లో నడవడం గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో కౌకుంట్ల గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






