17 August, 2026 | 1:00 PM

ఎడపల్లి–మంగళ్‌పాడ్ రోడ్లు గుంతలమయం

17-08-2026 12:28 PM

బోధన్, ఆగస్టు 17(విజయ క్రాంతి): ఎడపల్లి మండల కేంద్రం నుంచి మంగళ్‌పాడ్–కుర్నాపల్లి(Edapalli Mangalpad roads) గ్రామాల మీదుగా వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై అడుగడుగునా భారీ గుంతలు ఏర్పడి, వర్షం కురిసిన సమయంలో అవి నీటితో నిండిపోవడంతో గుంతల లోతు తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఈ రహదారిపై ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రహదారి దెబ్బతినడంతో వాహనాలను నెమ్మదిగా నడపాల్సి వస్తుండటంతో ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. రాత్రి వేళల్లో గుంతలు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాల ముప్పు మరింత ఎక్కువగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళ్‌పాడ్, కుర్నాపల్లి గ్రామాలకు రాకపోకలకు ఈ రహదారి ప్రధాన మార్గం కావడంతో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వాహనదారులు దీనిపై ప్రయాణిస్తున్నారు. రహదారి పరిస్థితి అధ్వాన్నంగా మారడంతో అత్యవసర పనుల కోసం వెళ్లే ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నవీపేట్ మండలంలోనూ ఇదే పరిస్థితి

ఇదిలా ఉండగా నవీపేట మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే రహదారి కూడా గుంతలతో అధ్వాన్నంగా మారింది. కళాశాలకు వెళ్లే విద్యార్థులు, అధ్యాపకులు, వాహనదారులు ప్రతిరోజూ ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై ఏర్పడిన గుంతల కారణంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.