రోడ్డెక్కిన రైతులు.. మద్దతు తెలిపిన ఎమ్మెల్యే కోవా లక్ష్మి
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు ప్రాజెక్టు(Vattivagu Project) ఆయకట్టు కింద సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు బూరుగుడా సమీపంలో జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కెనాల్ ద్వారా సాగునీరు అందించేందుకు వెంటనే ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రైతుల ఆందోళనకు ఎమ్మెల్యే కోవా లక్ష్మి(MLA Kova Lakshmi) మద్దతు తెలిపారు. ధర్నాలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ సాగునీరు అందకపోతే రైతులు పంటలు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. అధికారులు వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను ఆరిగోస పెడుతోందని విమర్శించారు.ఎల్‌నినో సాకుతో రైతులకు సాగునీరు విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. వర్షాలు కురిసి వరద నీరు సముద్రంలో కలుస్తున్నప్పటికీ ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. అన్నదాతల సమస్యలను పట్టించుకోకపోతే భవిష్యత్తులో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, రెబ్బెన సింగిల్ విండో చైర్మన్లు అలీబీన్ హైమద్, సంజీవ్, నాయకులు జీవన్, శ్రీనివాస్, నవీన్‌తో పాటు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






