జనసంద్రమైన నాగోబా
భారీగా తరలివచ్చిన భక్తులు..
జొన్న పేలాలు.. ఇప్పపువ్వు..
జొన్న గడక సాంబారు నాగోబాకు నైవేద్యం..
ఉట్నూర్, ఆగస్టు 17(విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ లోని ఆదివాసుల ఆరాధ్య దేవుడు నాగోబా జనసంద్రమైంది. శ్రావణమాసంలో మొదటి పండగగా జరుపుకునే నాగుల పంచమి పండగ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భక్తులతో పాటు మహారాష్ట్ర లోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల నుండి భక్తులు హాజరై నాగోబాను దర్శించుకున్నారు. నాగోబాను భక్తులు దర్శకరించుకున్నందుకు దాదాపుగా మూడు గంటల పైన వరుసలో ఉండవలసిన వచ్చింది.
నాగోబా పూజలకు హాజరైన భక్తులు పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఆదివాసీ గిరిజనులు నాగోబాకు నైవేద్యంగా జొన్న పేలాలతోపాటు ఇప్పపువ్వును, జొన్న గడక, సాంబార్ ను నైవేద్యంగా టేకు ఆకులతో పాటు మోదుగు ఆకులలో సమర్పించారు. నాగోబా దర్శనానికి వచ్చిన భక్తులకు మెస్రం వంశస్థులు నాగోబకు సమర్పించిన జొన్న గడక, సాంబార్ ను భక్తులకు వడ్డించారు. నాగోబా పూజలకు హాజరయ్యే భక్తులకు ఇబ్బందులు కలవకుండా ఉట్నూర్ ఏఎస్పీ రితిక్ సాయి కుట్టే, సీఐ మడవి ప్రసాద్, ఎస్సై సాయన్నలు బందోబస్తు ఏర్పాటు చేశారు.








