కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై బీఆర్ఎస్ దుష్ప్రచారం
హైదరాబాద్: కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ... ఒక ప్రైవేటు వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారని, కోర్టులో పిటిషన్ వేయడం వెనుక కూడా రాజకీయ కుట్ర ఉన్నట్లు తమకు అనుమానంగా ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్ తెచ్చిన కొన్ని పథకాలపై తాము ఎప్పుడూ రాజకీయం చేయలేదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.
భేషాజాలలకు పోకుండా మంచి పథకాలను ఎవరు తెచ్చిన అమలు చేశామన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ను యథాతథంగా కొనసాగిస్తున్నామని వివరించారు. హైకోర్టులో స్టే ఎత్తివేయించి .. మళ్లీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. చిన్న స్టేను సాకుగా చూపి బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ కింద ఈ ప్రభుత్వం రూ. 16 వేల కోట్లు ప్రజలకు ఇచ్చిందని మంత్రి లెక్క చెప్పారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేస్తుందని బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కోర్టు ఇచ్చిన స్టేపై బీఆర్ఎస్ నేతలు న్యాయపరంగా ఎందుకు పోరాడలేదు? అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. న్యాయపరమైన అంశాలను సరిచేసి.. పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తామని మంత్రి తెలిపారు.






