13 June, 2026 | 7:57 PM

సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం

13-06-2026 06:35 PM

* మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు

పాపన్నపేట: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి, సమస్యలు లేని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పేర్కొన్నారు. శనివారం పాపన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో ఆయన సుడిగాలి పర్యటన నిర్వహించి, వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా బోరుబావులకు విద్యుత్ మోటార్లను ప్రజలకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గ్రామస్తులతో మమేకమైన ఆయన స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, తాగునీరు, విద్యుత్, రహదారులు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటికి తక్షణ పరిష్కారం చూపడమే తమ బాధ్యత అని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటానని, ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో నడవాలన్నదే తన ఆకాంక్ష అని మైనంపల్లి హన్మంతరావు తెలిపారు.