13 June, 2026 | 8:51 PM

మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన సిపిఎం నాయకులు ఎర్ర అశోక్

13-06-2026 07:56 PM

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సిపిఎం పార్టీ నాయకులు సందర్శించినట్లు సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎర్ర అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం వల్లనే రోగులు తగ్గుతున్నారని సరైన సదుపాయాలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో బదిలీ అయినటువంటి డాక్టర్ ల స్థానంలో తిరిగి రిక్రూట్ మెంట్ చేయకపోవడం వల్ల సమస్య ఏర్పడుతుందని డాక్టర్ ల రిక్రూట్మెంట్ లను వెంటనే ఏర్పాటు చేయాలని ఎర్ర అశోక్ సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే ప్రజలు భయపడే విధంగా ప్రభుత్వం చేస్తుందని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం నిర్వీర్యంగా వ్యవహరించడం వల్లనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన విమర్శించారు.అనంతరం సిపిఎం మేడ్చల్ మండల కార్యదర్శి ఎం నరేష్ మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న మేడ్చల్ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ఇప్పటికీ పూర్తి చేయకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం దీని మీద నత్తనడక వ్యవహారం సరైన పద్ధతి కాదని ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని పూర్తి చేయడం కోసం చేయాల్సిన పనులన్నీ తొందరగా పూర్తి చేయని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని నరేష్ తెలిపారు.అదేవిధంగా మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృత దేహాలను పోస్టు మార్టం చేయడానికి సౌకర్యాలను ఏర్పాటు చేయకపోవడం వల్ల నగరంలోని గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మేడ్చల్ మండల నాయకులు రమేష్.నర్సింగ్ రావు.కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.