17 July, 2026 | 12:25 AM

బీసీలు తిరగబడితే బయట తిరగలేరు

17-07-2026 12:00 AM

ఈశ్వరమ్మ యాదవ్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలి 

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌

ఎల్బీనగర్, జులై 16: యాదాద్రి బోర్డ్ మెంబర్ ఈశ్వరమ్మ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఎల్బీనగర్ లోని ఈశ్వరమ్మ యాదవ్ నివాసానికి చేరుకొని ఆమెకు సంఘీభావం తెలిపి మీడియాతో మాట్లాడారు.

బడుగు బలహీన వర్గాలను గౌరవించాల్సిందిపోయి ఇష్టానుసారంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. రాష్ట్రం మొత్తం అగ్నిగుండంగా మారిందన్నారు. వెంటనే కాళ్ళు మొక్కి క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. రాజకీయాలలో ఇలాంటి మాటలు చెల్లవన్నారు. ఈశ్వరమ్మ యాదవ్ కు యావత్ తెలంగాణ మొత్తం అండగా ఉందన్నారు. సమాజం ఆలోచన చేయాలని తెలిపారు. రాజకీయలో ఓర్పు, సహనం అవసరమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.

తండ్రి కొడుకులు ఇద్దరు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలు తిరగబడితే అగ్రకులాల నాయకులు బయట తిరగలేరని ఆయన హెచ్చరించారు. బీసీలకు క్షమాపణలు చెప్పకుంటే  రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ధర్నాలు చేపడుతామన్నారు. ఈశ్వరమ్మకు మద్దతుగా తెలిపిన వారిలో మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, బీసీ సంఘాల నాయకులు ఎగ్గే మల్లేశం, పల్లె రవికుమార్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, బొంగు వెంకటేశ్ గౌడ్, దుర్గయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.