దమ్మపేట రెవిన్యూ కార్యాలయంలో బోర్‌వెల్ ప్రారంభించిన ఎం ఎల్ ఏ జారే
ప్రజల సౌకర్యం కోసం మండల రెవిన్యూ కార్యాలయంలో వసతులు
దమ్మపేట,(విజయ క్రాంతి): దమ్మపేట మండల రెవిన్యూ కార్యాలయంలో శుక్రవారం బోర్‌వెల్‌ను ఎం ఎల్ ఏ జారే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం ఎల్ ఏ జారే మాట్లాడుతూ వివిధ పనుల కోసం ప్రతిరోజూ మండల రెవిన్యూ కార్యాలయానికి వచ్చే ప్రజలకు మంచినీటి అవసరాలు తీరనున్నాయన్నారు.
అదేవిధంగా కార్యాలయానికి వచ్చే ప్రజలు, సందర్శకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని మహిళాశక్తి క్యాంటీను, మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజలకు కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
కొత్తూరులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన
ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందని అశ్వారావుపేట నియోజకవర్గ ఎం ఎల్ ఏ జారే ఆదినారాయణ స్పష్టం చేసారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థాయిలో అమలు చేస్తున్నామని, పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి సొంతింటి కల సాకారం చేస్తున్నామన్నారు.
మండల పరిధిలోని పార్కలగండి పంచాయతీ, కొత్తూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సొంత ఇల్లు లేని అనేక కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి
వనమహోత్సవంలో భాగంగా పలు చోట్ల మొక్కలు నాటారు మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. వనమహోత్సవం లాంటి కార్యక్రమాల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచడం, పర్యావరణాన్ని కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన పనులను గుర్తించి వాటిని దశలవారీగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో ముందుకు సాగుతామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ (అండర్ ట్రైనీ డిప్యూటీ కలెక్టర్) మద్దినేని మురళి, సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయుకులు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.






