8 July, 2026 | 9:50 AM

రూ.6.58 కోట్లతో ఎత్తిపోతల పథకాల మరమ్మత్తు పనులకు శంకుస్థాపన

08-07-2026 08:50 AM

రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం :

మంత్రి వాకిటి శ్రీహరి

ఆత్మకూరు: మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత మండలం ఈర్లదిన్నె గ్రామంలో చంద్రఘడ్–నాగిరెడ్డిపల్లి–బెక్కర్‌పల్లి ఎత్తిపోతల పథకాల(Chandraghad–Nagireddypalli–Bekkarpalli Lift Irrigation Scheme) మరమ్మత్తు పనులకు రూ.6.58 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులకు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత పదేళ్లలో ఎత్తిపోతల పథకాల నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాడైన లిఫ్ట్‌ల పునరుద్ధరణకు భారీగా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, జంగంరెడ్డిపల్లి, భూత్పూర్ ప్రాంతాల్లో కూడా కొత్త సాగునీటి పథకాలు చేపడతామని వెల్లడించారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని ఆరోపిస్తూ, తమ ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తూ రైతులకు అండగా నిలుస్తోందన్నారు.

తెలంగాణలో పండిన ధాన్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యంగా ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రఘడ్, నాగిరెడ్డిపల్లి, బెక్కర్‌పల్లి ఎత్తిపోతల పథకాల మరమ్మత్తులతో సుమారు 15 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సౌకర్యం మెరుగుపడుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కల్లు గీత కో-ఆపరేటివ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ నాగరాజు గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేందర్ రెడ్డి, చెన్నయ్య సాగర్ తదితరులు పాల్గొన్నారు.