8 July, 2026 | 9:44 AM

తనిఖీ పేరుతో నాయకుల విందు..!

08-07-2026 08:47 AM

విద్యార్థుల భోజనమే రుచి చూసిన ప్రజాప్రతినిధులు

పాఠశాలల్లో తనిఖీలా... లేక ప్రచార ఆర్భాటమా?

వనపర్తి: పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించాల్సిన తనిఖీలు కొన్నిచోట్ల ప్రచార కార్యక్రమాలుగా మారుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనిఖీ పేరుతో పాఠశాలకు వచ్చిన నాయకులు, అధికారులు విద్యార్థులకు వడ్డించిన భోజనాన్నే ప్లేట్లు పట్టుకుని తినడం చర్చనీయాంశంగా మారింది.

విద్యార్థుల కోసం ఉద్దేశించిన భోజనాన్ని పెద్దలు కలిసి తినడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో పరిమిత నిధులతో మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న పరిస్థితుల్లో, తనిఖీ పేరుతో పలువురు భోజనం చేయడం వల్ల విద్యార్థుల వాటా తగ్గే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భోజన నాణ్యతను పరిశీలించడం అవసరమే అయినప్పటికీ, ఒక ముద్ద రుచి చూడడం వేరు, విద్యార్థుల భోజనాన్ని ప్లేట్లు నింపుకుని తినడం వేరు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి చర్యలు తనిఖీల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని అంటున్నారు.