14 August, 2026 | 10:14 PM

సుల్తానాబాద్ లో మంత్రుల పర్యటనను విజయవంతం చేయండి

14-08-2026 09:11 PM

రూ.250 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): గతంలో మున్నెన్నడు లేని విధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో ఈనెల 17న రూ. 250 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఇతర ప్రజాప్రతినిధులచే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగే మంత్రుల బహిరంగ సభ స్థలిని ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే పరిశీలించారు.

అనంతరం స్థానిక వైశ్య భవన్ లో ప్రజా ప్రతినిధులు, మండల పార్టీ, పట్టణ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే   మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలను కనెక్టివిటీ చేసేందుకు డబుల్ బీటీ రోడ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ప్రధానంగా రూ. 100 కోట్లతో సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి నుండి ఓదెల మండలంలోని గ్రామాల గుండా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి వరకు డబల్ బి టి రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు.

రూ.42 కోట్లతో సుల్తానాబాద్ నుండి జూలపల్లి మండలం పెద్దాపూర్ వరకు బిటి రోడ్డు విస్తరణ, నిర్మాణం, రూ.32 కోట్లతో కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం, మంగపేట చౌరస్తా నుండి ముత్తారం మండల కేంద్రం వరకు నిర్మాణం, అలాగే గర్రెపల్లి, పూసాల, ఎలిగేడు, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రాల్లో రోడ్ల అభివృద్ధితోపాటు సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయడంజరుగుతుందన్నారు.  మండలాల్లో పలు బిటి రోడ్లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య , మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ , కౌన్సిలర్లు, సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.