ఖర్గే పట్ల వివక్షపూరిత చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ఖర్గే పట్ల వివక్షపూరిత ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బహిరంగ సభకు హాజరైన అనంతరం సభా ప్రాంగణాన్ని బీజేపీ నాయకులు గంగాజలంతో శుద్ధి చేశారనే ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ ఘటనకు నిరసనగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ కార్యక్రమాన్ని నిర్వహించగా ఎమ్మెల్యే గండ్ర ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమాన గౌరవం కల్పించిందని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని తెలిపారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి మహనీయులు కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గాంధేయ మార్గంలో శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం చేస్తుందని, అందులో భాగంగానే బట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో ఈ సత్యాగ్రహ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.
వివక్ష వద్దు, సమానత్వం కావాలని, కులం పేరుతో అవమానం వద్దు, ప్రతి మనిషికి గౌరవం కావాలని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం సామాజిక న్యాయాన్ని సాధిద్దాం అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్, కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి పట్టణ, పలు మండలాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మహిళా విభాగం నాయకులు, యూత్ నాయకులు, ఎన్ఎస్యూఐ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






