నాలుగు ఎకరాల కోసం నాలుగు దశాబ్దాల పోరాటం
* మా భూములు మాకే ఇవ్వాలి
* ఆనందాపురం గిరిజనుల డిమాండ్
అశ్వాపురం,(విజయక్రాంతి): ఆనందాపురం గ్రామానికి చెందిన గిరిజన కుటుంబాలు తమకు వారసత్వంగా వచ్చిన సుమారు నాలుగు ఎకరాల భూమి అక్రమంగా పట్టాలు చేయించుకుని కొంతమంది ఆధిపత్య వర్గాల వ్యక్తులు దశాబ్దాలుగా అనుభవిస్తున్నారని ఆరోపిస్తూ శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. భూముల విషయమై ప్రశ్నించగా తమపై తప్పుడు కేసులు నమోదు చేసి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు.
గ్రామంలో సంవత్సరాలుగా కొందరు వ్యక్తులు ప్రజా ప్రతినిధులుగా, పెద్దమనుషులుగా వ్యవహరిస్తూ గిరిజనులను భయభ్రాంతులకు గురిచేసి తమ హక్కుల నుంచి దూరం చేస్తున్నారని వాపోయారు. రెవిన్యూ కార్యాలయంలో పలుమార్లు దరఖాస్తులు సమర్పించినప్పటికీ స్పందన లభించలేదని, తమ భూముల వ్యవహారంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, జిల్లా కలెక్టర్‌ను కలిసి న్యాయపరమైన పోరాటానికి సిద్ధమని స్పష్టం చేస్తూ తమ హక్కులను వదులుకోబోమని తెలిపారు.




