ఇది ఎన్‌కౌంటర్ కాదు... ముమ్మాటికీ హత్య
ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్, మందడి ఇజ్రాయిల్
తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): బీహార్ రాష్ట్రంలోని భోజ్‌పూర్ జిల్లాకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త భరత్ భూషణ్ తివారి ఎన్‌కౌంటర్ ఘటనపై ప్రజాసంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు మందడి ఇజ్రాయిల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్వరాలను ఎన్‌కౌంటర్ల పేరిట అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.
భరత్ భూషణ్ తివారి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల తరఫున గొంతుకగా నిలిచారని తెలిపారు. పోలీసుల కథనాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఖండిస్తూ ఇది నకిలీ ఎన్‌కౌంటర్ అని ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర న్యాయ విచారణ జరిపించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్ మందడి ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు.






