ఇంజక్షన్‌తో సంతానం కలుగుతుందంటూ మోసం
మేడ్చల్‌లో నకిలీ వైద్యుడు అరెస్టు
మేడ్చల్, జూన్ 23(విజయ క్రాంతి): ఇంజక్షన్ తో సంతానం కలుగుతుంది అంటూ అమాయకులను మోసం చేస్తున్న ఒక నకిలీ వైద్యున్ని పోలీసులు కటకటాల్లోకి పంపారు. మేడ్చల్ లో పెంటయ్య అనే వ్యక్తి ఏడు గుళ్ల వెనుక శివరామ కృష్ణ డే కేర్ సెంటర్ పేరిట ఆస్పత్రి నిర్వహిస్తున్నాడు. సంతానం లేని వారికి ఇంజక్షన్ ఇస్తే సంతానం కలుగుతుందని ప్రచారం చేసుకుని అనేక మంది వద్ద పెద్ద మొత్తంలో వసూలు చేశాడు.
కొందరు బాధితుల ఫిర్యాదు మేరకు కుత్బుల్లాపూర్ ఎస్‌ఓటి పోలీసులు ఆసుపత్రిలో సోదా నిర్వహించగా పెంటయ్య బండారం బట్టబయలైంది. సోదా సమయంలో ఆస్పత్రిలో ఇద్దరు మహిళలు ఇంజక్షన్ కోసం వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆసుపత్రికి ఎలాంటి అనుమతులు లేవు. మహిళా వైద్యురాలి సర్టిఫికెట్ పెట్టుకొని ఆస్పత్రి నిర్వహిస్తున్నట్లు తేలింది. వివిధ రోగాలకు చికిత్స చేస్తున్నారు. పోలీసులు పెంటయ్యను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.






