పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
గ్రామస్థాయి పోలీసులు ఎప్పటికప్పుడు గ్రామాలపై పట్టు సాధించాలి..
నార్నూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే
ఉట్నూర్,(విజయక్రాంతి): పోలీసులు శాంతి భద్రతలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడంతో పాటు గ్రామ పోలీసు అధికారులు గ్రామాలపై పట్టు సాధించే విధంగా విధులు నిర్వహించాలని ఉట్నూర్ ఏఎస్పీ రిత్విక్ సాయి కొట్టి అన్నారు. బుధవారం నార్నూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, కేసు దర్యాప్తు వివరాలు, పెండింగ్ కేసులు, CCTNS నమోదు మరియు స్టేషన్ నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు.
అనంతరం పోలీస్ సిబ్బందితో సమావేశమై నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, రాత్రి గస్తీ, బీట్ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయడం, పెండింగ్ కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయడం మరియు ప్రజల ఫిర్యాదులపై సత్వర స్పందన వంటి అంశాలపై సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంతో పాటు, నేరాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో నార్నూర్ పోలీస్ స్టేషన్ సీఐ అంజమ్మ, ఎస్సై శ్రీ సాయి,మరియు సిబ్బంది పాల్గొన్నారు.






