ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి రూ.15 కోట్లు
దశలవారీగా ఆలయ పునర్నిర్మాణం.. భక్తులకు మెరుగైన వసతులు
ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లి, ఓదెల,(విజయక్రాంతి) ప్రముఖ పుణ్యక్షేత్రం ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని దశలవారీగా అభివృద్ధి చేసి భక్తులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ స్థపతితో కలిసి ఆయన పరిశీలించారు.
ముందుగా మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాతల సహకారంతో నిర్మించనున్న 22 భక్తుల వసతి గృహాల సముదాయానికి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ ఇప్పటికే రూ.1.30 కోట్లతో రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఆలయ పునర్నిర్మాణానికి రూ.15 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినట్లు వెల్లడించారు. ఆలయానికి నూతన గోపురాలు, రాతి శిల్పాలతో ప్రాకారాన్ని నిర్మించి మరింత సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు.
అలాగే పర్యాటక శాఖ నుంచి మరో రూ.8 కోట్ల నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో ఓదెల మల్లికార్జున స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు, ఆలయ ఈఓ, స్థానిక గ్రామ సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






