జిల్లెల్లలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో కోడి అంతయ్య, N5TG టెక్నాలజీ సంస్థ ఫౌండర్ అంకారపు రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి వైద్య సేవలు పొందారు. శిబిరంలో సాధారణ వైద్యం, కంటి, దంత, ఈఎన్టీ పరీక్షలు ఉచితంగా నిర్వహించి, అవసరమైన వారికి చికిత్స సూచనలు అందించారు.
కంటి ఆపరేషన్లు అవసరమైన రోగులను గుర్తించి ఉచిత శస్త్రచికిత్సకు ఎంపిక చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కోడి అంతయ్య తెలిపారు. ప్రజల నుంచి లభించిన ఆదరణతో భవిష్యత్తులో కూడా ఆరోగ్యం, విద్య, సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. ఈ శిబిరంలో సేవలందించిన వైద్యులు, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సహకారంతో ఉచిత కంటి ఆపరేషన్లు ఏర్పాటు చేశారు.






