12 July, 2026 | 4:28 PM

రెండు ఊళ్ల నుంచి.. 9.4లక్షల ఎకరాలకు

02-12-2024 04:10 AM

భారత్‌పై దండయాత్ర తర్వాత రెండు ఊళ్లు కేటాయించిన మహ్మద్ ఘోరీ

స్వాతంత్య్రం తర్వాత వక్ఫ్ కిందకి వందల ఎకరాలు

రైల్వే, డిఫెన్స్ తర్వాత మూడో స్థానంలో వక్ఫ్ స్థిరాస్తులు

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: భారత్‌దేశంలో మహ్మద్ ఘోరీ అడుగుపెట్టడానికి పూర్వం ఇక్కడ వక్ఫ్ అనే మాటే అసలు వినబడలేదు. 1175లో ఇస్మాయిలీ రాజును, రెండో తరైణ్ యుద్ధంలో పృథ్విరాజ్ చౌహాన్‌ను ఓడించిన పిదప ఉత్తర, వాయువ్య భారతదేశంలో ఘోరీ తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఒకప్పు డు భారత్‌లో భాగంగా ఉన్న ముల్తాన్‌లోని జామా మసీద్‌కు రెండు గ్రామాలను ఘోరీ  విరాళంగా అందజేస్తూ ఆ భూమి నిర్వహణ బాధ్యతలను మత పెద్దకు అప్పగించాడు.

1206లో ఘోరీ మరణానంతరం అతడి కింద పని చేసిన వాళ్లు ఢిల్లీని ఆక్రమించుకుని బానిస వంశాన్ని స్థాపించారు. ఈ బానిస వంశానికి చెందిన రాజులు ఈ పద్ధతిని మరింత ప్రోత్సహిస్తే ఆ తర్వాత వచ్చిన వాళ్లు వక్ఫ్ పద్ధతిని స్థాపించారు. ముల్తాన్ ప్రాంతానికి చెందిన ఓ లేఖలో వివరాల ప్రకారం మసీదులకు, మదర్సాలకు, దర్గాలకు ఆర్థిక బలం చేకూర్చాలనే ఉద్దేశంతో ముస్లిం రాజులు తొలుత భూమి విరాళాలను విరివిగా చేసినట్టు తెలుస్తోంది. 

9.4లక్షల ఎకరాల భూమి

ఢిల్లీ సుల్తానుల కాలంలో విరాళంగా ఇచ్చిన భూములు వక్ఫ్ ఆస్తిగా మారాయి. ఇల్‌టుట్ మిష్, మహ్మద్‌బిన్ తుగ్లక్ వంటి సుల్తాన్‌లు అప్పటికే న్న వక్ఫ్‌లను సంరక్షించడంతోపాటు  మరికొన్ని ప్రాంతాల్లో క్తొత వాటిని స్థాపించారు. మొఘల్ వంశానికి అక్బర్, షాజహాన్ వంటి చక్రవర్తుల కాలంలో వక్ఫ్ సంస్థ మరింత బలంగా మారింది. కాలక్రమం లో ముస్లిం కమ్యూనిటీలు గ్రామీణ ప్రాంతా ల్లో స్థిరపడటంతో వక్ఫ్ భావన గ్రామాలకు విస్తరించింది.

మొఘలుల తర్వాత భారతదేశా న్ని పాలించిన బ్రిటీష్ ప్రభుత్వం 1923లో ముస్సల్మాన్ వక్ఫ్ చట్టాన్ని ప్రవేశపెట్టింది. స్వాతంత్య్రం అనంతరం భారత ప్రభుత్వం 1954లో వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చింది. అలాగే 1995, 2013లో వక్ఫ్ బోర్డుల అధికారాలు మరింత బలోపేతం చేస్తూ ప్రభుత్వం చట్టాల ను సవరించింది. మహ్మద్ ఘోరీ సమయం లో చిన్నగా ప్రారంభమైన ప్రక్రియ ప్రస్తుతం బలమైన శక్తిగా మారింది. దేశ వ్యాప్తంగా వక్ఫ్ బోర్డు కింద 9.4లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ఇండియన్ రైల్వే, ఇండియన్ డిఫెన్స్ తర్వాత అంత పెద్ద మొత్తంలో భూములు వక్ఫ్ బోర్డు పరిధిలోనే ఉండటం గమనార్హం. 

పార్లమెంట్‌లో వక్ఫ్ సవరణ బిల్లు

వక్ఫ్ బోర్డు పరిధిలోకి వెళ్లిన భూమిని అల్లా ఆస్తిగా భావిస్తారు. వక్ఫ్‌కు సంబంధించిన భూములను కొనడానికి గానీ అమ్మడానికి గానీ ఇతురులెవరికీ అధికారం ఉండదు. దీన్ని తీవ్రంగా పరిగణించిన బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టాలకు సవరణలు చేసేందుకు సిద్ధం అయింది.  ప్రతిపక్షాలు గోల చేయటంతో బిల్లును ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపింది. జేపీసీ దీనిపై చర్చలు జరుపుతోంది. కాగా, బిల్లు సమగ్ర అధ్యయనానికి మరింత గడువు ఇవ్వాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.  అయితే ప్రభుత్వం మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఈ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని చూస్తోంది.

బోర్డు కిందకి దేవాలయాలు

కొద్ది రోజుల క్రితం త్రిచిరాపల్లి జిల్లాకు చెందిన 70ఏళ్ల  రాజగోపాల్ అనే రైతు కుమార్తె వివాహం కోసం తన 1.2 ఎకరాల భూమిని విక్రయించాలనుకున్నాడు. అయి తే ఇన్ని రోజులపాటు తనది అనుకున్న భూమి వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉందని తెలిసి ఒక్కసారిగా నిర్ఘాంత పోయాడు. ఒక్క రాజగోపాల్ స్థలం మాత్రమే కాదు అతడి గ్రామంలోని మొత్తం భూమి సహా 1500ఏళ్లనాటి సుందరేశ్వర దేవాలయం కూడా వక్ఫ్‌బోర్డు కిందే ఉందని తెలిసి గ్రామస్థులంతా షాకయ్యారు.