09-02-2026 02:21:55 AM
హనుమకొండ (మహబూబాబాద్), ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్)లో జరిగిన అగ్ని ప్రమాదం యాదృచ్ఛికం కాదని, ఇది పూర్తిగా ఓటుకు నోటు కేసు సాక్ష్యాధారాలను శాశ్వతంగా తొలగించేందుకు రూపొందించిన కుట్ర అని బీఆ ర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటుకు నోటు కేసు ప్రస్తుతం చివరి దశకు చేరుకొని శిక్ష పడే పరిస్థితి ఉండటంతోనే, హోంశాఖ మంత్రిగా ఉన్న ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ఈ ప్రమాదానికి తెరలేపారని ఆరోపించారు.
నేరగాడే ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాంటి దుర్మార్గ ఘటనలు జరగడం సహజమని అన్నారు. ఆదివారం హనుమకొండ బాల సముద్రంలోని హనుమకొండ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అత్యంత భద్రత కలిగిన ఫోరెన్సిక్ ల్యాబ్‌లో చలికాలంలో అగ్ని ప్రమా దం జరగడం, 24 గంటలు ఉద్యోగులు ఉండాల్సిన చోట ఎవరూ లేకపోవడం, మొదట ‘పెద్ద నష్టం జరగలేదు అని చెప్పిన ప్రభుత్వం..
ఆదివారం 2015 నుంచి పదేళ్లకు సంబంధించిన కీలక సాక్ష్యాధారాలు పూర్తిగా దగ్ధమ య్యాయని చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. మూడు అంతస్తుల భవనంలో మొదటి అంతస్తులో మంటలు చెలరే గినా వాటిని ఆర్పడానికి మూడున్నర గంటలు పట్టిందంటే, ఇది సాధారణ ప్రమాదం కాదని స్పష్టం అవుతుందన్నారు.
ఈ ఘటనలో సుమారు 50 కంప్యూటర్లు, సర్వర్లు, కీలక రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయని, ఈ అగ్ని ప్రమాదం వల్ల ఓటుకు నోటు కేసుతో పాటు వేలాది ఘోర నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలు నాశనమై, నేరస్తులు సమాజంలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో బీజేపీ పెద్దల సూచనల మేరకు, బడే భాయ్ ఛోటా భాయ్ లాలూచీతోనే ఈ కుట్ర జరిగిందన్న అనుమానాలు ప్రజల్లో బలంగా ఉన్నాయని చెప్పారు.
బీజేపీ, రేవంత్ రెడ్డి మధ్య నిజంగా ఎలాంటి సంబంధం లేకపోతే, వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని నిష్పాక్షిక విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగం ముఖ్యమంత్రి ప్రైవేట్ ఆర్మీలా వ్యవహరిస్తోందని, అందుకే ఈ ఘటనపై నిజాలు బయటకు రాకుండా దాచిపెడుతున్నారని ఆరోపించారు.
రాష్ట్ర పోలీసులకు నిజంగా దమ్ముంటే పూర్తి నిజానిజాలు ప్రజల ముందుకు తీసుకురావాలని సవాల్ విసిరారు. ఈ ఘటనపై రిటైర్డ్ జడ్జితో నిష్పాక్షిక విచారణ జరపాలని, అలాగే అన్ని పార్టీల ప్రతినిధులతో కూడిన బృందాన్ని ప్రమాద స్థలానికి అనుమతించి, శావేత్తల ద్వారా పూర్తి వివరాలు తెలియజేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని తెలంగాణ ప్రజలు ఒక ఘోరమైన కుట్రగా భావిస్తున్నారని, నిజం బయటపడే వరకు బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. సమావేశంలో హనుమకొండ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, గ్రేటర్ వరంగల్ మాజీ మేయర్, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు.