09-02-2026 02:05:19 AM
ఆమనగల్లు, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలో కీలకమైన ఆమనగల్లు మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. పోలింగ్ కు కొద్దిరోజుల సమయం మాత్రమే ఉండటంతో ముఖ్యనేతలంతా సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఎవరికివారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారంలో మునిగిపోయారు. పట్టణంలో 15 వార్డులు ఉండగా, పాగా వేసేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నడుస్తున్నది.
1996 కన్నా ముందు కాంగ్రెస్ వరుసగా అధికారం చెలాయించగా, 1995 నుంచి ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆచారి సర్పంచ్ గా ఎన్నిక కాగా 2001 టీడీపీ నుంచి మణి, 2006లో బీజేపీ నుంచి యాదయ్య, 2013లో కాంగ్రెస్ గుర్రం కరుణ శ్రీ గెలిపొందారు.
2018లో పంచాయతీ నుంచి మున్సిపల్ గా అప్ గ్రేడ్ అయింది. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తొలి మున్సిపల్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకున్నది. మున్సిపాలిటీలో తొలిసారి గిరిజన సామాజికవర్గానికి చెందిన రాంపాల్ నాయక్ మున్సిపల్ చైర్మన్ పీఠం అధిరోహించారు. రెండవ సారి మున్సిపల్ ఎన్నికల బరిలో కుర్చీని దక్కించుకోవడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు నువ్వానేనా? అనే రీతిలో తలపడుతున్నాయి.
పార్టీల బలాబలాలు ఇవే..
-ఆమనగల్లులోని 15 వార్డులు ఇప్పుడు రాజకీయ కురుక్షేత్రయుద్ధాన్ని తలపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండటం కాంగ్రెస్కు అతిపెద్ద బలం. స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మద్దతు, ఎంపీ మల్లు రవి ప్రభుత్వ సంక్షేమ పథకాలు(ఆరు గ్యారెంటీలు) తమను గట్టెక్కిస్తాయని ధీమాతో ఉన్నారు. ముఖ్యంగా పాత ఆమనగల్లు ప్రాంతంలోని వార్డులపై పట్టు సాధించేందుకు శ్రమిస్తున్నారు.
బీఆర్‌ఎస్ గత పాలనలో చేసిన అభివృద్ధి పనులను చూపిస్తూ ఓట్లు అడుగుతున్నారు. పటిష్టమైన క్యాడర్, మాజీ ప్రజాప్రతినిధుల పరపతి వీరి ప్రధాన అస్త్రాలు. కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని కసితో ఉన్నారు.
బీజేపీ నుంచి బీసీ జాతీయ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి స్థానికంగా పార్టీకి పెద్ద బలం. ప్రధాని నరేంద్రమోడీ చరిష్మా కాగా, యువత ఓటర్లే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఆచారి ఆమనగల్లుకు చెందినవారే కావడంతో పట్టణంపై ఆయనకు కొంత పట్టుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, హిందూత్వ ఎజెండాతో పాటు అధికార పార్టీ మోసపూరిత హామీలపై ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరగడం గమనార్హం.
ముగ్గురు నేతలకు ప్రతిష్టాత్మకం
కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కల్వకుర్తి, ఆమనగల్లును రెండు బ్లాక్ లుగా పిలుస్తుంటారు. అయితే కల్వకుర్తి ప్రస్తుత ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, బీజేపీ జాతీయ నేత టి.ఆచారి, మరోనేత, మిషన్ భగీరథ మాజీ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ ఈ బ్లాక్ కు చెందినవారే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వీరికి ఆమనగల్లు మున్సిపాలిటీ ఎన్నికల గెలుపు ఓ రకంగా పరీక్ష లాంటిదేనని చెప్పాలి.
ఇక్కడ గెలుపు సాధిస్తే ఆ ప్రభావం ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాలమండలాలపై పడే అవకాశం ఉంది. సదరు నేతలకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు బ్యాంకు పరంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసమే కీలక నేతలంతా ఇక్కడే తిష్టవేసి గెలుపు గుర్రాలను పరుగులు తీయిస్తున్నారు. అభ్యర్థుల తరఫున రాత్రింబవళ్లు ప్రచారం చేస్తున్నారు. కానీ ఆమనగల్లు పట్టణ ప్రజలు ఎవరి ఆదరిస్తారో వేచిచూడాలి.
వ్యూహాలు.. ప్రతి వ్యూహాలు
ఆయా పార్టీలు ప్రతివార్డుకు ఒక కీలక నేతను ఇన్ చార్జ్గా పెట్టి తమ పార్టీ గెలుపులో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఆయా పార్టీ లో ఒక వైపు అసమ్మతి నేతలను బుజ్జగిస్తునే మరోవైపు పార్టీ పార్టీ అభ్యర్థులు గెలుపులో కీలక భూమిక పోషిస్తున్నారు. సామాజికవర్గాల సమీకరణలను లెక్కకడుతూ గెలుపుపై ధీమాతో ఉన్నారు. అది నుంచి పార్టీలకు నిర్ణయాత్మక శక్తిగా ఉన్న కొన్ని సామాజికవర్గాల మద్దతు కూడగట్టేందుకు అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతున్నారు. సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ఎండగడుతూ రీల్స్, పోస్టర్లతో హోరెత్తిస్తున్నారు.
అభివృద్ధికి పట్టంకడతారా?
మున్సిపల్ ఓటర్లు కేవలం పార్టీలను మాత్రమే కాకుండా, అభ్యర్థి వ్యక్తిత్వాన్ని కూడా గమనిస్తున్నారు. ఆయా పార్టీలో బరిలో ఉన్నవారి గుణగణాలను పరిశీలిస్తున్నారు. వారిని గెలిపిస్తే అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తాడా? అవినీతి అక్రమాలకు పాల్పడతాడా? ఇలాంటి విభిన్న కోణాలను ఆలోచిస్తున్నారు.
కొన్ని వార్డుల్లో ఇంకా మిషన్ భగీరథ నీరు సక్రమంగా అందడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. వర్షం వస్తే లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం పెద్దసమస్యగా మారింది. పట్టణంలో సరైన కమ్యూనిటీ హాల్స్, పార్కులు లేకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా చిన్నతరహా పరిశ్రమలు తీసుకురావాలని కోరుతున్నారు.
మొత్తంగా పరిశీలిస్తే అధికార కాంగ్రెస్ పార్టీ హవా కనిపిస్తున్నప్పటికీ, బీఆర్‌ఎస్ కు ఉన్న పాత పునాదులు, బీజేపీకి పెరుగుతున్న ఆదరణ ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉంది. నేతలంతా హామీల వర్షం కురుస్తున్నా గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నేతల వైపే మొగ్గుచూపే అవకాశం ఉంది. ఆమనగల్లు మున్సిపల్ పీఠంపై ఏ జెండా ఎగురుతుందనేది 15 వార్డుల్లోని ప్రజల తీర్పుపై ఆధారపడి ఉంది.