3 March, 2026 | 4:19 AM

గ్రామ పంచాయతీల్లో నిధుల గోల్ మాల్

03-03-2026 12:34 AM

*పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు కుమ్మక్కు... ఏడు జీపిల నిధులు సుమారు రూ.7లక్షల వరకు కంప్యూటర్ ఆపరేటర్ అకౌంట్లోకి మళ్లింపు

* ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వరిగుంతం గ్రామస్తులు

కొల్చారం, మార్చి 2: ఇటీవల కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలకు మంజూరు చేసింది. ఈ నిధులను గ్రామంలోని పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాల ఏర్పాటుతో పాటు ఇతర పనులకు కేటాయించాల్సి ఉంది.

మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని పలు గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు కంప్యూటర్ ఆపరేటర్ కుమ్మక్కై గ్రామపం చాయతీ నిధులు స్వాహా చేశారని వరిగుంతం గ్రామానికి చెందిన యువకులు సోమవారం ఆధారాలతో సహా ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు.

మండలంలోని వరిగుంతం, రంగంపేట, సంగాయిపేట, పోతిరెడ్డిపల్లి, కొంగోడు గ్రామపంచాయతీలకు సంబంధించిన నిధులు ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న వ్యక్తి ఖాతాలోకి ని ధులు మళ్లించారని ఈ నిధులకు సంబంధించిన ఖర్చు వివరాలపై వరిగుంతం లో గ్రామసభ నిర్వహించగా గతంలో పంచాయతీ కార్యదర్శి గా పనిచేసిన వ్యక్తి ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి ఈ నిధులకు సంబంధించిన లెక్కలు గ్రామ సభలో చూపించలేకపోయారన్నారు.

నిధులు మొత్తం కంప్యూటర్ ఆపరేటర్ తో కలిసి స్వాహా చేశారని ఫిర్యాదు చేశారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఇదే పరిస్థితి నెలకొందని గ్రామపంచాయతీ నిధులు కంప్యూటర్ ఆపరేటర్ అ కౌంట్ లోకి ఎలా జమ చేస్తారని ఈ సందర్భంగా వరిగుంతం గ్రామ యువకులు ఎంపీడీవో రఫిక్ ఉన్నిసా బేగం, ఎంపీఓ కృష్ణవేణి లను నిలదీశారు. ఈ విషయమే గతవారం ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటికీ పంచాయతీ కార్యదర్శులపై గాని కంప్యూటర్ ఆపరేటర్ పైగాని చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వరిగుంతం గ్రామ బిఆర్‌ఎస్ నాయకులు ప్రశాంత్, తేజ తదితరులు పాల్గొన్నారు.